టీడీపీ బస్సు యాత్ర అట్టర్‌ప్లాప్‌.. ఎందుకిలా జరుగుతోంది? | TDP Leaders Bus Yatra Failure | Sakshi
Sakshi News home page

టీడీపీ బస్సు యాత్ర అట్టర్‌ప్లాప్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Jul 1 2023 8:22 PM | Updated on Jul 1 2023 8:58 PM

TDP Leaders Bus Yatra Failure - Sakshi

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బస్సు యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ఆ పార్టీ శ్రేణులే ఆటంకాలు కల్పిస్తున్నాయి.

అదేంటో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఫెయిల్ అవుతోంది. తాజాగా భవిష్యత్ గ్యారెంటీ అనే పేరుతో ఐదు ప్రాంతాల నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు పచ్చ నేతలు. ఎక్కడా జనం ఈ పచ్చ బస్సుని పట్టించుకోవడంలేదు. అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర కూడా సేమ్. అయితే ఈ జిల్లాలో బస్సు యాత్రను టీడీపీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బస్సు యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ఆ పార్టీ శ్రేణులే ఆటంకాలు కల్పిస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈనెల 23న ప్రారంభమైన బస్సు యాత్ర 30వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సాగాల్సి ఉంది. అయితే గ్రూపు రాజకీయాల కారణంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను టీడీపీ అధిష్టానం రద్దు చేసింది. 26వ తేదీన మడకశిరలో బస్సు యాత్ర జరగాల్సి ఉంది. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఈరన్న ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగాల్సి ఉంది. ఈరన్న నాయకత్వంలో తాము పనిచేసేది లేదని గుండుమల తిప్పేస్వామి వర్గం పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసింది. బస్సుయాత్రలో ఈరన్న పాల్గొంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని తిప్పేస్వామి వర్గం అల్టిమేటం జారీ చేసింది. యాత్ర ఆగిపోయి పరువు ఎక్కడ పోతుందో అని భయపడిన టీడీపీ నాయకత్వం ఏకంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాప్తాడు నియోజకవర్గంలో యాత్రను దారి మళ్లించి బ్రతికిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాస్తవానికి బస్సు యాత్ర ప్రారంభం నుంచే టీడీపీ నేతల గ్రూపు రాజకీయాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి.
చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్‌సీపీదే జయభేరీ

కదిరి నియోజకవర్గంలో అత్తార్ చాంద్ భాషా అసంతృప్తిగా ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారది, స్థానిక నేత సవితమ్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. పెనుకొండలో జరిగిన బస్సు యాత్రలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పర నినాదాలు, తోపులాటలతో బీకే, సవిత వర్గాలు ఆధిపత్యాన్ని చాటుకునేందుకు యత్నించాయి. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో రెండు వర్గాలవారిని పోలీసులు చెదరగొట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉండటంతో బస్సు యాత్ర ఉద్దేశం దారి తప్పుతోంది. భవిష్యత్తు గ్యారెంటీ ప్రజలకు కాదు...ముందు తమకు ఇవ్వాలని టీడీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేస్తూ ఉండటంతో పచ్చ పార్టీ పరువు బజారున పడుతోంది.
చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!

మరోవైపు బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. ప్రజలే పట్టించుకోనపుడు ఈ యాత్ర వల్ల ఉపయోగం ఏముందని టీడీపీ సీనియర్లే ప్రశ్నించుకుంటున్నారు. అనవసరంగా యాత్ర  ప్రారంభించామని, మధ్యలో ఆపలేమని లోలోన మదనపడుతున్నట్లు టాక్ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement