
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.
నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్‌కు క్రైస్తవులు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.