పవన్‌.. మూడు ముక్కలాటతో పోలికా? ప్రజల మనోభావాల పట్టింపు లేదా?

Special Story On Pawan Kalyan Comments In Srikakulam - Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రణస్థలంలో యువశక్తి కార్యక్రమంలో  ఆయనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తున్నాననుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని వ్యంగ్యంగా అనబోయి బొక్కా బోర్లపడినట్లు అనిపిస్తుంది. ఆయన స్వోత్కర్ష ఎంత అయినా ఫర్వాలేదు. కానీ ప్రజల ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకుని మాట్లాడాలి. మూడు ముక్కలాటతో మూడు రాజధానులను పోల్చడం అంటే ఏమైనా తెలివైన చేష్ట అవుతుందా? ఒకప్పుడు పవన్ కళ్యాణే విశాఖ, కర్నూలలో పర్యటించినప్పుడు ఇవే తన మనసుకు రాజధానులు అని ప్రకటించారు.

తద్వారా అక్కడి ప్రజల సెంటిమెంట్ ను మాట్లాడారని అంతా అనుకున్నారు. కానీ యువశక్తి ప్రోగ్రాంలో ఆయన విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకించారని అనుకోవాలి. ఆయన ఎక్కడా అమరావతి పేరు తీయలేదు. అంతవరకు భయపడి ఉండవచ్చు. నేరుగా అమరావతే రాజధానిగా ఉండాలని చెబితే మిగిలిన ప్రాంతంలో జనసేనకు నష్టం జరుగుతుందని భయపడి ఉండాలి. అలాకాకుండా మూడు ముక్కలాట అనడం ద్వారా ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్ ను గాయపర్చినట్లు అనిపిస్తుంది. విశాఖ రాజధాని అయితే ఒక ముక్క  ఎలా అవుతుంది. రాష్ట్రంలో విభజన వాదం రాకుండా ఉండడానికి, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రతిపాదన తెచ్చారు.

అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తెలుగుదేశం , జనసేన అదినేతలు, మరికొన్ని రాజకీయ పక్షాలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కారణాలు ఏమైనా ఆ విషయం చెప్పడం తప్పులేదు. కాని పవన్ కళ్యాణ్ తాను విశాఖను ఎందుకు కార్యనిర్వాహక రాజధానిగా వద్దంటున్నది చెప్పలేదు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని ఎందుకు అక్కర్లేదో చెప్పడం లేదు. ఆయన మిత్రపక్షంగా ప్రస్తుతానికి ఉన్న బిజెపి కాని, వామపక్షాలు కాని కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.తెలుగుదేశం, జనసేనలు మాత్రమే అన్నీ ఒకే చోట ఉండాలని భావిస్తున్నాయి. ఆ విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పలేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడిన తీరు, అరే, ఒరే,తురే అంటూ మాట్లాడిన పద్దతి ఒక పార్టీ అధినేతగా ఏ మాత్రం తగదని చెప్పకతప్పదు.

గత ఏభై ఏళ్లలో పార్టీ అధినేతలు ఎవరూ ఇలా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కొన్నిసార్లుదూషణలకు దిగుతున్నా, అరే,ఓరే వరకు వెళ్లలేదు. వైసీపీలో కొందరు నేతలు బూతులు మాట్లాడుతున్నారని అంటున్న పవన్ కళ్యాణ్ వారిని మించి బూతులు మాట్లాడడం దారుణంగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీనేతలు ఎవరూ బూతులు మాట్లాడినట్లు అనిపించదు. టీడీపీ , వైసీపీమధ్య అలాంటి వివాదాలు ఉండవచ్చు కాని జనసేన పక్షాన ఎందుకు ఆయన ఇలా మాట్లాడారో అర్ధం కాదు.

ఏదో చిన్న స్థాయి నేతలు ఇలా ఉపన్యసించారంటే వారిని తప్పుపట్టి సరిచేయవచ్చు. కాని ఏకంగా పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం ఏ మాత్రం పద్దతి కాదని చెప్పక తప్పదు. ఇదే సందర్భంలో ఆయన చెప్పుతో కొడతానని మరోసారి అంటున్నారు. బహుశా ఈ మాటలు అంటే అక్కడకు వచ్చిన యువకులు ఉత్సాహపడతారని అనుకున్నారేమో!లేక ఆ ఊపులో వైసిపివారిని లేదా తమకు నచ్చని ఇతరులను ఇలా చెప్పుతో కొట్టాలని ఆయన భావవేమో తెలియదు. ఇంతా చేస్తే ఆయనకు తన సభకు వచ్చిన జనం మీద నమ్మకం లేదని అంటున్నారు. తన సభకు జనం వచ్చినా ఓట్లు వేయడం లేదని ఆయనే ఒప్పుకుంటున్నారు.

ఎందుకు ఓట్లు పడడం లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలికాని ప్రజలను నిందిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది?తాను ఈ పదేళ్లలో ఎన్నిసార్లు మాటలు మార్చింది.. ఉదాహరణకు కాపు అన్న అంశంపై ఎన్నిరకాలుగా మాట్లాడింది ఆయన వీడియోలు వేసుకుని చూస్తే తెలుస్తుంది. ఒకటని కాదు.. అనేక అంశాలలో ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తన ఎజెండా ఏమిటో చెప్పకుండా జనరల్‌గా మాట్లాడి రోడ్లు వేస్తా, వలసలు ఆపుతా, జెట్టిలు కడతా.. ఫలానా కేసులో నిందితులకు శిక్ష వేయిస్తా.. ఇలాంటి హామీలతో జనం నమ్ముతారా? అసలు వలసలకు ఎవరు కారణం. 1953 నుంచి ఇంతవరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ,టీడీపీలే కదా? ఈ మూడేళ్లలోనే కదా వైసీపీఅదికారంలోఉన్నది?వారిని తప్పుపడితే పోనే ఒకే అనుకుందాం. కానీ అసలు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో ఏమి బాధ్యత లేదా? ఆయన పాలనలో వలసలు ఆగిపోయాయని చెప్పదలించారా?నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు వారి, వారి అవసరాల రీత్యా వలస వెళుతుంటారు.

అది జీవన ప్రక్రియలో ఒక భాగం. ఆ మాటకు వస్తే గుంటూరు జిల్లాలో పుట్టిన పవన్ కళ్యాణ్ తదుపరి ఎన్ని జిల్లాలకు వెళ్లారు. చివరికి హైదరాబాద్ కు వలస వెళ్లి ఎందుకు  స్థిరపడ్డారు? ఆయన పుట్టిన ఊరులోనో, లేక తండ్రి ఉద్యోగం చేసిన ఊరులోనో, రిటైరైన ఊరులోనే స్థిరపడి ఉంటే పవన్ కు ఈ అవకాశాలు వచ్చేవా?  కాకపోతే ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు పెంపిందించాలని అనడం తప్పుకాదు.అలాకాకుండా జగన్ పై ద్వేషభావంతో పవన్ మాట్లాడడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌కే కాదు.. తమకు కూడా చెప్పులు ఉన్నాయని ఆయన చూపించారు.

రాజకీయ వ్యభిచారం తదితర అంశాలపై కూడా పవన్‌ను విమర్శించారు. జనసేన నేతలు వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబుతో పొత్తు ఉంటుందని చెప్పడానికి, ఏభై నాలుగు సీట్లు అడుగుతున్నామని సంకేతం ఇవ్వడానికి పవన్ ఈ సభ పెట్టినట్లుగా ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నట్లు చెప్పలేకపోవడం ఆయన బలహీనత. గౌరవప్రదంగా పొత్తు ఉండాలని అన్నారు కానీ ఏది గౌరవమో చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి పదవిలో వాటా  ఇవ్వకపోయినా గౌరవప్రదమే అని అనుకుంటున్నారా? లేక ఏభై నాలుగు సీట్లలో ఎన్నిసీట్లు ఇస్తే గౌరవం అని ఆయన చెప్పదలిచారు. ఇలాంటివాటిపై  భవిష్యత్తులో ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పవన్ సభ లో విషయం కన్నా విసిగింపే ఎక్కువగా ఉందేమో!ఎందుకంటే ఆయన ఏ విషయంలోను క్లారిటీ ఇవ్వలేకపోవడమే కారణం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top