వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్‌షా’ ఎవరో?

Special Story On Huzurabad By Election - Sakshi

ఉపఎన్నిక పోరుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం 

షెడ్యూల్‌ విడుదలతో వేడెక్కిన రాజకీయం

ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్, బీజేపీ

అభ్యర్థి ఖరారుపై ఇంకా తేల్చుకోని కాంగ్రెస్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌/కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని ఈ నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం సీఈసీ విడుదల చేసింది. భూకబ్జా వివాదం కేసులో బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్‌ 12న ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, దాదాపు 16 వారాల తరువాత ఈ స్థానానికి నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా–నేనా అన్నట్లుగా రాజకీయ సమరం సాగింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారాతో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.

వేడెక్కిన హుజూరాబాద్‌...  
ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలతో హుజూరాబాద్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల బర్తరఫ్, రాజీనామా నుంచే రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. చివరకు ఈ పోటీ మంత్రి హరీశ్, ఈటల రాజేందర్‌ మధ్యనే అన్నట్లు మారింది. ఒకరు తన గెలుపు కోసం కసరత్తు చేస్తుంటే.. మరొకరు ప్రత్యర్థి విజయావకాశాల్ని దెబ్బతీసే వ్యూహరచనలో తలమునకలయ్యారు. ఈటల బీజేపీలో చేరడంతోటీఆర్‌ఎస్‌ అధినేత ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే.. చాలాకాలంగా చెబుతున్న దళితబంధు పథకాన్ని తొలుత హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్‌ తనకు అప్పగించిన బాధ్యతల్ని కొంతకాలం తెరవెనుక ఉండి నడిపించిన హరీశ్‌.. తర్వాత నేరుగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు.


ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇక, 2009, 2010, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి విజయం సాధించిన ఈటల రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకూ ఆయనను ఢీకొట్టే నేతలెవరూ లేకుండాపోయారు. ఈసారి గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఆయన ముందుకుసాగుతున్నారు. నిన్నమొన్నటి వరకు మోస్తరు నుంచి ముమ్మరంగా సాగిన ప్రచారం.. షెడ్యూల్‌ ప్రకటనతో ఊపందుకుంది. ఇక టీఆర్‌ఎస్, బీజేపీ నేతల ప్రచారాలతో హుజూరాబాద్‌ హోరెత్తనుంది.

కాంగ్రెస్‌ అభ్యర్థిపై సస్పెన్స్‌..: ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు బీజేపీ నుంచి ఈటల సిద్ధమయ్యారు. తమ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ ఇదివరకే ప్రకటించింది. కేవలం ఇన్‌చార్జ్‌లను నియమించిన కాంగ్రెస్‌.. అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్సే కొనసాగిస్తోంది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే కావడం గమనార్హం. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డాక్టర్‌ కవ్వంపెల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రచారంలో ఉన్నా.. ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ విడుదల కావడంతో ఒక్కసారి అప్రమత్తమైన ప్రధాన పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో పడ్డాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top