Maharashtra: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లు ఉద్దవ్‌ థాక్రేవే!

Shiv Sena Sanjay Raut Confident 100 Seats For Uddhav Thackeray - Sakshi

ముంబై: శివ సేన రెబల్స్‌ తిరుగుబాటు సంక్షోభ సస్పెన్స్‌ తర్వాత.. బీజేపీ మద్దతుతో షిండే వర్గం అధికారంలో కొలువుదీరింది. అయితే.. శివ సేన మాత్రం తమది నైతిక విజయం అని, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్‌ విసురుతోంది. ఈ తరుణంలో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాక్రే.. కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు కాదని.. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను(ఈడీ, సీబీఐలను ఉద్దేశిస్తూ..), డబ్బును అడ్డం పెట్టుకుని శివ సేనను హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివ సేన 100 సీట్లకుపైగా గెలుచుకుంటుంది. ఉద్ధవ్ థాక్రేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే.. శివ సేన తమ ఓటర్లను కోల్పోయినట్టు కాదు” అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా ఈ విషయంపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలకు సవాలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఉద్ధవ్ సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగానే తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top