మహా రాజకీయం: తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు

Shiv Sena Rebels May Goes For New Party Sanjay Raut Warn - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్‌ లీడర్‌ ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.  ఈ మేరకు డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్‌)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్‌థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతోందని, దీనిపై సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. 38 మంది రెబల్‌ ఎమ్మెల్యే కుటుంబాలకు భద్రతను ఉపసంహరించుకోవడంపై ఏక్‌నాథ్‌ షిండే మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ఉద్దవ్‌థాక్రేతో పాటు మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాశారు. రెబల్‌ ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, దుర్మార్గంగా వ్యవహరించొద్దంటూ లేఖలో పేర్కొన్నారాయన. వాళ్లకేదైనా జరిగితే సీఎం థాక్రే, పోలీసులదే బాధ్యత అంటూ హెచ్చరించారు షిండే.

ఇదిలా ఉంటే.. అనర్హత నోటీసులు జారీ చేసిన డిప్యూటీ స్పీకర్‌ నరహరి సీతారాం జిర్వాల్‌పై షిండే విమర్శలు ఎక్కువ పెట్టారు. న్యాయ పోరాటానికి దిగుతామని, అవసరమైతే.. డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని షిండే ప్రకటించారు. 

ఓర్పు నశిస్తే..
శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని పేర్కొన్నారు. శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒక వేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

సభకు రండి.. తెలుస్తుంది
శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు. కాగా.. ఏక్ నాథ్ షిండేతో కలిసి అస్సాం క్యాంపులో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు శనివారం దాడి చేశారు.

అస్సాం గువాహతిలో రాడిసన్‌ బ్లూ హెటల్‌లో రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేశారు. ఆ హోటల్‌ ముందు అస్సాం శివసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే ముంబైకి వెళ్లి.. ఉద్దవ్‌ థాక్రేతో కలిసిపోవాలని, సంక్షోభానికి ఓ ముగింపు పలకాలని అస్సాం శివ సేన యూనిట్‌ చీఫ్‌ రామ్‌ నారాయణ్‌ సింగ్‌, ఏక్‌నాథ్‌ షిండేను కోరుతున్నాడు.

షాజీ.. రాష్ట్రపతి పాలన విధించండి
శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లు, వాళ్ల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను విడిచిపెట్టి, బాలాసాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని కేంద్రం హోం  మంత్రి మిత్ షాను అభ్యర్థిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజానికి స్వస్తి పలకడంతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎంపీ నవనీత్‌ కౌర్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీలు.. శివసేన పరిస్థితులు సర్దుమణిగి..  మహా వికాస్‌ అగాడి కూటమి తిరిగి అధికారం చేపడుతుందనే ధీమాలో ఉన్నాయి. ఈ మేరకు శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చదవండి: శివసేనలో కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top