Seediri Appalaraju Fires on Chandrababu and ABN Andhra Jyothi - Sakshi
Sakshi News home page

ఇసుమంత అవినీతి లేదు

May 24 2022 5:33 AM | Updated on May 24 2022 8:25 AM

Seediri Appalaraju on Chandrababu and ABN Andhra Jyothi - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ సంచార పశు వైద్య వాహనాల (వెటర్నరీ అంబులేటర్లు) కొనుగోలులో ఇసుమంత అవినీతి లేదని, పూర్తి పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో కొన్నామని, అదే విధానంలో నిర్వహణకు అప్పగించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబునాయుడుకి వత్తాసు పలుకుతూ వెటర్నరీ వాహనాల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ అని ఆంధ్రజ్యోతిలో పిచ్చి రాతలు రాయడం సరికాదని మండిపడ్డారు.

‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణకు, చంద్రబాబుకి సిగ్గు, లజ్జ ఏమైనా ఉంటే తన ముందు నిల్చోవాలని, ఒక్క పైసా అవినీతి లేకుండా పారదర్శకంగా చేశామన్నది ఆధారాలతో నిరూపిస్తానని మంత్రి సవాల్‌ విసిరారు. మంత్రి సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పశువులకు వైద్య సేవలందించేందుకు ఈ వాహనాలు కొన్నట్లు చెప్పారు.

వీటి కొనుగోలులో విమర్శలకు తావు లేకుండా తమ శాఖ డైరెక్టర్‌ని కాకుండా ఏపీడీడీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ అధ్యక్షులుగా, మత్స్య శాఖ, రవాణా శాఖ కమిషనర్లు, పశు సంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్, పీపీపీ ఎక్స్‌పర్ట్‌ (ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌), పశు సంవర్థక శాఖ సంచాలకులు సభ్యులుగా టెండర్‌ ఎవాల్యూయేషన్‌ కమిటీ వేశామన్నారు.

జాతీయ స్థాయిలో ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ఫ్లాట్‌ఫారం ద్వారా టెండర్లు పిలిచి రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో ఒక్కో వాహనానికి రూ.28.17 లక్షలు (జీఎస్టీ అదనం) చొప్పున 175 వాహనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామన్నారు. ఎల్‌–1 గా ఎంపికైన టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ఒక్కో వాహనానికి రూ.32,19,905.40 కు (జీఎస్టీ అదనం) కొటేషన్లు వేసిందన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఒక్కో వాహనం రూ.28,17,417.15కు (జీఎస్టీ అదనం) సరఫరా చేసేందుకు విజయవంతంగా బిడ్డర్‌ను టెండర్‌ ఎవెల్యూయేషన్‌ కమిటీ ఎంపిక చేసిందని తెలిపారు. టాటా మోటార్స్‌ లిమిటెడ్‌కు జీఎస్టీతో కలుపుకొని ఒక్కో వాహనం రూ.33,24,562.24కు సరఫరా చేసేందుకు ఎల్‌వోఏ జారీ చేసినట్లు చెప్పారు. వీటి కొనుగోలుకు, హైడ్రాలిక్‌ లిఫ్ట్, తదితర అదనపు ఎక్విప్‌మెంట్‌ వాహనంతో పాటు సరఫరా చేసేందుకు 175 వాహనాలను రూ.58.18 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఈ వాహనాలకు రెండేళ్లకు ఆపరేషన్, మెయింటెనెన్స్‌ కోసం ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచేందుకు రూ.79.80 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ టెండర్లలో ఎల్‌–1 గా ఎంపికైన జీవీకే– ఇఎంఆర్‌ఐ (సికింద్రాబాద్‌) ఒక్కో వాహనానికి నెలకు రూ.1,85,400కు కొటేషన్‌ వేయగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఒక్కో వాహనానికి నెలకు రూ.1.67,787 చొప్పున విజయవంతమైన బిడ్డర్‌గా కమిటీ ఎంపిక చేసిందని వివరించారు.

ఈ మేరకు ఎల్‌వోఏ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలను గ్రామీణ ప్రాంత అవసరాలకు తగ్గట్టుగా తయారు చేశామన్నారు. వీటి ద్వారా మారుమూల గ్రామాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందుతాయని చెప్పారు. వీటిలో 5 రకాల పరీక్షలు, 75 రకాలు శస్త్ర చికిత్సలు చేయవచ్చని, 81 రకాల మందులు ఉంటాయని తెలిపారు. వైద్యం కోసం తీసుకెళ్లిన జీవిని చికిత్స అయ్యాక తిరిగి వాహనంలోనే ఇంటికి తీసుకువస్తారన్నారు. 1962 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే వాహనం వస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వచ్చాయి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు వచ్చాయని, టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏం వచ్చాయో చెప్పాలని మంత్రి సవాల్‌ విసిరారు. దీనిపై బహిరంగ చర్చకు అచ్చెన్నాయుడు గానీ ఇతర టీడీపీ నేతలెవ్వరైనా సిద్ధమా అని అన్నారు. దావోస్‌కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సతీమణితో వెళ్లడం తప్పు అని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. చంద్రబాబునాయుడు ఆయన కొడుకు, కోడలితో వెళ్లిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

సంచార పశు వైద్య వాహనాల్లో రూ.7 కోట్లు ఆదా
పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌
సాక్షి, అమరావతి: రైతుల గుమ్మం వద్దనే పశు వైద్య సేవలందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ సంచార పశు వైద్య సేవా రథాల (వెటర్నరీ అంబులేటరీ వెహికల్స్‌) కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. వాహనాల కొనుగోలు, నిర్వహణలో కుంభకోణం జరిగిపోయిందంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంపై ఆయన మండిపడ్డారు. ఈ వాహనాల కొనుగోలుకు జాతీయ స్థాయిలో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు పిలిచామన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అనుసరించి వాహనాలు కొన్నట్లు తెలిపారు. దీనిద్వారా ఒక్కో వాహనంపై రూ.4,02,488 చొప్పున 175 వాహనాల కొనుగోలులో రూ.7,04,35,444 ఆదా చేయగలిగామని చెప్పారు. అదే విధంగా నిర్వహణకు ఒక్కో వాహనంపై రూ.15,613 చొప్పున మొత్తం రూ.27,32,275 ఆదా చేయగలిగామన్నారు. వాహనంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ఆపరేట్‌ చేసేందుకు వాహన డ్రైవర్లకు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతిలో ఒక్కో వాహనాన్ని రూ.81 లక్షలు వెచ్చించి కొన్నదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టుపై అవాస్తవాలతో కూడిన కథనం ద్వారా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించడం సరికాదని సోమవారం ఓ ప్రకటనలో హితవు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement