
తాడేపల్లి: రాష్ట్రంలోని దుష్ట శక్తులన్ని ఏకమై ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలో దేవాలయాలపై జరుగుతున్నదాడుల వెనుక భారీ కుట్ర కోణం దాగివుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఈ కుట్రలకు నాయకత్వం వహిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 31 లక్షల అడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతంటే, వాటిని చీకటితో చెరిపేసే ఉద్దేశంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తిని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వినకుండా దేవుళ్ళతో ఆటలాడుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసం వెనుక దాగివున్న కుట్రను త్వరలో ఛేదిస్తామని, ప్రభుత్వం దానిపై సిట్ వేసిందని సజ్జల పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత అమ్మఒడి పథకానికి అడ్డు తగిలేందుకు చంద్రబాబు తన అనుంగ అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్ ను మరోమారు తెరమీదకు తెచ్చారని, కానీ వారి పాచికలు పారలేదని సజ్జల పేర్కొన్నారు. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నిమ్మగడ్డకు కోర్టు అక్షింతలు వేసిందని అన్నారు. ఈ వరుస పరిణామాలన్ని గమనిస్తే ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని తెలిపారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయకత్వంలోని దుష్టశక్తులు కుట్రలకు పాల్పడుతూ ప్రజాసంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.