జగన్‌కు జనం జేజేలు

Sajjala Ramakrishna Reddy Comments On CM Jagan Rule - Sakshi

ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాలే అందుకు నిదర్శనం 

సాధారణ ఎన్నికలకన్నా పెరిగిన ఓట్ల శాతం 

రోడ్లపై కంకర ఎత్తుకెళ్లింది టీడీపీ రియల్‌ మాఫియానేమో! 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనరంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏలూరు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు దీన్ని మరోసారి రుజువు చేశాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రోడ్లు తవ్వి కంకర ఎత్తుకెళ్తున్నారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడం సత్యదూరమన్నారు. టీడీపీ రియల్‌ మాఫియానే ఈ పని చేస్తోందేమోననే అనుమానం వ్యక్తంచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించే పరీక్ష కేవలం శాఖాపరమైందేనన్నారు. రెగ్యులరైజ్‌ చేయడానికే పరీక్ష నిర్వహిస్తున్నామని,  ఎవరినీ తొలగించబోమని భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ‘సజ్జల’ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

ఫ్యాన్‌కు 56.43.. సైకిల్‌కు 28.2 శాతం ఓట్లు 
రెండేళ్ల పాలన తర్వాత వైఎస్‌ జగనే శాశ్వత సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 44.73 శాతం ఓట్లొస్తే, టీడీపీకొచ్చింది 42.21 శాతం. తాజాగా.. జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 56.43 ఓట్ల శాతం వస్తే... టీడీపీ 28.2 ఓట్ల శాతంతో దిగజారిపోయింది. ఇక జనసేనకు 2019లో 16,681 ఓట్లు వస్తే, ఇప్పుడొచ్చిం ది కేవలం 7,407 మాత్రమే. సానుకూల ఓటింగ్‌తో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా పట్టం కడుతున్నారు. 

రోడ్ల దొంగతనమా? 
రాజధాని ప్రాంతంలో రోడ్లు తవ్వుకుని కంకర దొంగతనం చేశారని ఈనాడు దినపత్రిక దిక్కుమాలిన కథనం రాయడం దుర్మార్గం. ఇదెక్కడైనా ఉంటుందా? వైఎస్సార్‌సీపీ వాళ్లు జేసీబీ, టిప్పర్‌తో తీసుకెళ్తున్నారట.. దళిత వేదిక వెంటబడితే పారిపోయారట. అసలు జేసీబీ వెళ్లే వేగం ఎంత? వెంటబడితే పట్టుకోలేరా? అమరావతి పేరుతో పేదల భూములను దోచుకునే పగటి కలను వైఎస్‌ జగన్‌ భగ్నం చేశారు. ఫలితంగా టీడీపీ రియల్‌ మాఫియా ఆదాయం దెబ్బతిన్నది. దీంతో వాళ్లే ఈ పని చేస్తున్నారేమో? చంద్రబాబు  పాపాల పుట్ట బయటపడుతుంటే కట్టుకథలు తెరమీదకు తెస్తున్నాడు. 

‘సీమ’ ఎత్తిపోతలపై మీ వైఖరేంటి? 
రాయలసీమకు వైఎస్‌ జగన్‌ అన్యాయం చేస్తున్నాడనేది టీడీపీ తప్పుడు ప్రచారం. ఆ పని చేసింది చంద్రబాబే. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాళ్ల వైఖరేంటో చెప్పాలి. రాయలసీమకు నీళ్లు రాకుండా తెలంగాణ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు తన హయాంలో ఎందుకు అడ్డుకోలేదు? తక్కువ సమయంలో కేటాయించిన నీళ్లు వాడుకోవాలని వైఎస్‌ జగన్‌ మొదట్నుంచీ ఆలోచిస్తున్నారు. 

బీసీలకు దన్నుగా సీఎం వైఎస్‌ జగన్‌ 
చంద్రబాబు హయాంలో కేవలం పచ్చ చొక్కాలకే పూర్తి లబ్ధిచేకూరిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నూర్‌బాషా, దూదేకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఫక్రూబి మహ్మద్‌ రఫీ అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నూర్‌బాషా, దూదేకుల కులానికి చెందిన రాష్ట్రస్థాయి నేతల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఒక నమ్మకం, విశ్వాసంతో బీసీల పక్షాన నిలబడి రాష్ట్రంలో ఒక సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారన్నారు. మిగిలిన సామాజికవర్గాలన్నీ తాము బీసీల్లో ఎందుకు పుట్టలేదా అని ఆలోచించే అగ్రస్థితికి సీఎం జగన్‌ బీసీలను చేరుస్తున్నారని సజ్జల అన్నారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా నిరుపేదలకు రూ.లక్ష కోట్లకు పైగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసి పేదరిక నిర్మూలన దిశగా సీఎం జగన్‌ ముందడుగు వేశారని తెలిపారు. అందుకే జగన్‌పట్ల ప్రజల్లో అభిమానం నేడు కట్టలు తెంచుకుంటోందని.. అందుకు నిదర్శనమే ఏలూరు కార్పొరేషన్‌ ఫలితమని వివరించారు. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని సంరక్షించేది బీసీలేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ రఫీ, టైలర్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుభాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top