ఎన్నికలు ఆపడం అన్యాయం 

Sajjala Ramakrishna Reddy On cancellation of parishad elections - Sakshi

హైకోర్టు తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తాం 

ప్రజాతీర్పును అడ్డుకోవడం టీడీపీ కుసంస్కారానికి నిదర్శనం 

విపక్షానికి వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు  

దొంగదెబ్బ తీయడంలో చంద్రబాబు ఆరితేరారు 

ఏ శక్తుల అండతో రెచ్చిపోతున్నారో ప్రజలకు తెలుసు 

రఘురామకృష్ణరాజు కుట్ర నిజమేనని సుప్రీంకోర్టు గుర్తించింది 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు దురదృష్టకరం, అన్యాయమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తుందని చెప్పారు. చిల్లర రాజకీయాలతో ప్రజాతీర్పును అడ్డుకుని టీడీపీ సంబరపడటం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ కుసంస్కారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో నేరుగా వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే చంద్రబాబు దొంగదెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ శక్తుల అండతో బాబు రెచ్చిపోతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..  

నిమ్మగడ్డ హయాం నుంచే.. 
కరోనా నేపథ్యంలోనూ ఎన్నికల ప్రక్రియను యజ్ఞంలా పూర్తిచేస్తే.. న్యాయస్థానం దీన్ని సీరియస్‌గా తీసుకోలేదన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎన్నికలు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల ప్రకారమే జరిగాయి. ఎన్నికలను ఆపాలని కోర్టుకెళ్లినవారి ఉద్దేశం ప్రజలకు తెలుసు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హయాం నుంచే ఈ దాగుడుమూతలు మొదలయ్యాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎన్నికలు వాయిదా వేశారు.. వద్దంటే ఎన్నికలన్నారు,. ప్రజా తీర్పును ఆపిన టీడీపీ నేతలకు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదు. ఇలాంటి కుయుక్తులతో తాత్కాలిక ఆనందం పొందుతారేమో కానీ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌వైపే జనం ఉంటారు. టీడీపీ, దాని వెనుక ఉన్న శక్తులు ఆయనను అడ్డుకోలేవు.  

వ్యవస్థలను, మీడియాను టీడీపీ అడ్డుపెట్టుకుని..  
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు పెట్టిన దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు పరిగణనలోనికి తీసుకుంది. దీన్నిబట్టి ఆయనపై మోపిన కేసులకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గుర్తించినట్టే. సీఐడీ విచారణకు సహకరించాలని చెప్పడంతోపాటు అడ్డూ అదుపు లేకుండా హద్దుమీరి చేస్తున్న ఆయన చర్యలకు అడ్డుçకట్ట వేసింది. జగన్‌ ప్రభుత్వానికి రాజకీయ, వ్యక్తిగత కక్షలూ లేవు. ప్రజల కోసం పనిచేయాలని, వారి ఆశీస్సులు సంపాదించాలన్న ఏకైక అజెండా తప్ప. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర.. ఇలా ఎవరిపైనైనా ప్రాథమిక ఆధారాలున్నందునే కేసులు పెట్టారు. అధికారంలో ఉన్నా మేం ఎవరినీ వేధించడం లేదు. అధికారంలో లేకున్నా టీడీపీ వాళ్లే వ్యవస్థలను, మీడియాను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి కుయుక్తులను ఎదుర్కొనే శక్తి మాకుంది. ప్రజలే మా బలం. గతంలోనూ జగన్‌పై కుట్రలు చేసి పెట్టిన కేసులన్నీ అబద్ధాలని తేలిపోతున్నాయి. 

అంతా చంద్రబాబు డ్రామా 
రఘురామకృష్ణరాజును వైద్యం కోసం టీడీపీకి అనుకూలమైన రమేశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. తీసుకెళ్లకపోతే నేరమంటున్నారు.. వివాదం సృష్టిస్తున్నారు. ఆ ఆస్పత్రికి ఉన్న విశ్వసనీయత ఏంటి? కోవిడ్‌ మరణాలతో ఆ ఆస్పత్రి వెలుగులోకొచ్చింది. కేసులున్న ఆస్పత్రిని కోరుకోవడంలో అర్థమేంటి? ఏ శక్తులు వాళ్లకు అండగా ఉంటున్నాయో ప్రజలకు తెలుసు. కోర్టుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే పోలీసులు కొట్టారని డ్రామా మొదలుపెట్టారు. నిజంగా ఆయనకు గాయమై ఉంటే కోర్టులో నడవగలరా? వాహనంలో వెళ్తూ నొప్పి కూడా లేకుండా మీడియాతో మాట్లాడగలరా? మీసం తిప్పగలరా? సీఐడీ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించినప్పుడు బయటపడని గాయాలు.. ఆ తర్వాత ఎలా వచ్చాయో.. మధ్యలో ఏం జరిగిందో తేలాలి. ఇదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా. కేసులో తన బండారం బయటపడుతుందని డ్రామాను బాబు మరింత ముందుకు తీసుకెళ్లారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top