ఆత్మగౌరవ దండోరా మోగిద్దాం

Revanth Reddy Vs Maheshwar Reddy In Congress Party Meeting - Sakshi

ఇంద్రవెల్లి సభతో శంఖం పూరిద్దాం.. టీపీసీసీ నిర్ణయం 

ఐఏఎస్‌ల పనితీరు సక్రమంగా లేదని ఆరోపణ 

దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి 

ఇంద్రవెల్లి సభపై రేవంత్, ఏలేటి మధ్య స్వల్ప వాగ్వాదం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దక్కించుకునేందుకు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి శంఖం పూరిస్తామని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రకటించింది. దళితులు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని పేర్కొంది. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్, అంజన్‌ కుమార్, ప్రచార కమిటీ కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఇంద్రవెల్లి సభపై చర్చ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. తనకు సమాచారం లేకుండా ఇంద్రవెల్లి సభపై ఎలా నిర్ణయం తీసుకుంటారని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించగా.. పీసీసీ చీఫ్‌గా తనకు అధికారం ఉందని, అయినా అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ చెప్పినట్టు సమాచారం. 

ప్రభుత్వానివి అబద్ధాలు, అక్రమాలే.. 
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమంతా అబద్ధాలు, అక్రమాలతోనే సాగుతోందని సమావేశంలో నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఐఏఎస్‌ ఉద్యోగం చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌లో ఉంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేస్తున్నారని.. ఈఎన్సీ మురళీధర్‌రావు రిటైరై ఏళ్లు గడుస్తున్నా కొనసాగించడం ఏమిటన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇక ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి సభకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాగా పేరు ఖరారు చేశారు.

ఈ సభ నిర్వహణకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని ప్రకటించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై వచ్చే బుధవారం కరీంనగర్‌ నేతలతో  సమావేశం అవుతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాగా.. పీసీసీ నూతన కార్యవర్గాన్ని మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వారిని విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా రేవంత్‌ పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top