అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యత

Revanth Reddy comments over brs - Sakshi

సహకరించకపోతే కొట్లాడతాం

సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ

రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమి పూజ

రాజకీయాలు, అభివృద్ధి రెండూ వేరని సూత్రీకరణ

బీఆర్‌ఎస్‌ ఘర్షణ ధోరణితో కారిడార్‌ ఆలస్యమైందని వ్యాఖ్య

కేటీఆర్‌ చచ్చుడో.. జీహెచ్‌ఎంసీకి నిధులు వచ్చుడో’ అంటూ దీక్ష చేయాలని సూచన

కంటోన్మెంట్‌: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కోసం కేంద్రంతో సఖ్యతగానే ఉంటామని, అదే రాజకీయాల విషయానికి వస్తే మాత్రం పోరాటం చేస్తూ ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే కొట్లాడుతామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలనీ, ఎన్నికలు ముగిశాక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో రాజీవ్‌ రహదారిపై చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు అల్వాల్‌ టిమ్స్‌ ఆవరణలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతోనే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కన బెట్టిందన్నారు.

తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని చెప్పారు. రక్షణ శాఖకు భూములు అప్పగించామనీ, అదే సమయంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం రక్షణ శాఖ భూములు కావాలని కోరామని సీఎం వివరించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికీ సహకరించిందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష..
ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాం తప్ప రాజకీయాల కోసం కాదని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో ఏదైనా ఒక శాశ్వత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో గంజాయి, డ్రగ్స్, పబ్‌లు తప్ప ఏమీ రాలేదని ఎద్దేవా చేశారు.

’’ఎలివేటెడ్‌ కారిడార్‌ విషయంలో మా పోరాటం ఫలించిందని కేటీఆర్‌ అంటున్నాడు.. ఇంతకీ ఆయన ఏం పోరాటం చేసిండు. ట్విటర్‌ లో పోస్టులు పెట్టుడే ఆయన పోరాటమా?’’ అని ప్రశ్నించారు.  హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం ఇందిరా పార్కు వద్ద కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు.  కేటీఆర్‌ చచ్చుడో అభివృద్ధికి నిధులు వచ్చుడో అని దీక్ష చేయాలన్నారు.

కేటీఆర్‌ దీక్షకు దిగితే కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆయన్ను కంచె వేసి కాపాడుతారన్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సెక్రెటరీ బి.అజిత్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ అదనపు కమిషనర్‌ ఆమ్రపాలి, కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ సోమశంకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top