
విద్యార్థులు, యువత లక్ష్యంగా పార్టీ కార్యాచరణ
ఎర్రవల్లి నివాసంలో ముఖ్యనేతలతో కేసీఆర్
అన్ని జిల్లా కేంద్రాల్లో విస్తృత స్థాయి భేటీలు... రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయి
కరీంనగర్ బీసీ సభ ద్వారా కాంగ్రెస్‌ను ఎండగట్టాలి
ఫిరాయింపుదారులపై చర్య తీసుకునేలా ఒత్తిడి చేద్దాం
స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్‌ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ను ఆదేశించారు.
ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు.
బనకచర్లతో జరిగే నష్టంపై..
నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి.
అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్‌ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు.
దృష్టి మళ్లించేందుకే విచారణలు
ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం.
బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు
బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్‌లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు.
పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్‌కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.