ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు పదవులా? | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు పదవులా?

Published Sun, Mar 5 2023 1:41 AM

Revanth Reddy comments on KCR - Sakshi

సిరిసిల్ల: తెలంగాణ వచ్చినంక కాపలా కుక్కలాగా ఉంటానన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు పిచ్చి కుక్కలాగా మారారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. ఆ కుక్కను తరిమికొట్టాలని ప్రజల కు పిలుపునిచ్చారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నచౌక్‌లో రేవంత్‌ ప్రసంగించారు. 

ఉద్యమకారులెవరూ ఆస్తులు కూడబెట్టలేదు.. 
చరిత్రలో ఎందరో ఉద్యమకారులున్నా ఎవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం వంద ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఆయన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్, మైనింగ్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని కుక్క కరిచి చంపితే సీఎం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని,  ఆదుకోవాలనే సోయి కేసీఆర్‌కు లేదన్నారు.  

తెలంగాణ ఇచ్చినోళ్లకు అవకాశం ఇవ్వండి.. 
‘తెలంగాణ తెచ్చానని చెప్పే కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిచ్చారు. మరి తెలంగాణ ఇచ్చినోళ్లకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’అని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. 2004లో కరీంనగర్‌ సభలో ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ  రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి సోనియాకు కృతజ్ఞతగా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. 

సిరిసిల్ల నేతన్నలనూ మోసం చేస్తూ.. 
బతుకమ్మ చీరల పేరిట, మ్యాక్స్‌ సంఘాల పేరిట మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నేతన్నలను మోసగిస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. నేతన్నలకు నూలు డిపోలు అందుబాటులోకి రాలేదని, అపెరల్‌ పార్క్‌ పూర్తి కాలేదని, నేత కార్మికులు ఓనర్లు కాలేదన్నారు.

కాగా, నేరెళ్ల దళితులపై పోలీసులు దాడి చేసినప్పుడు మాట్లాడిన బండి సంజయ్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఎవరికి లొంగిపోయారని రేవంత్‌ ప్రశ్నించారు. సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కార్యక్రమ ఇన్‌చార్జి గిరీశ్, నేతలు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె.కె.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

కమీషన్లు వస్తేచాలా?: రేవంత్‌ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సెంటిమెంట్‌ పుణ్యమాని రాష్ట్రాన్ని శాసిస్తున్న కేటీఆర్‌.. సొంత నియోజకవర్గంలో శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కాల్వ పనులు పడకేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మీకు కమీషన్లు వచ్చేస్తే చాలా?.. కాల్వల్లోకి నీళ్లు రావాల్సిన అవసరం లేదా?’అని ఆ ట్వీట్‌లో రేవంత్‌ ప్రశ్నించారు.   

రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశ్రుతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోని సింగసముద్రం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. సింగసముద్రంలోకి వెళ్లే కాల్వను పరిశీలించి సిరిసిల్లకు తిరిగి వస్తుండగా రాచర్లతిమ్మాపూర్‌ స్టేజీ సమీపంలోని తుర్కపల్లి వద్ద రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో రాగట్లపల్లికి చెందిన రవితోపాటు పలువురు విలేకరులు గాయపడ్డారు. రేవంత్‌ క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement