నేటి నుంచి రేవంత్‌ దీక్ష 

Revanth Reddy 48 Hrs Dalit Girijana Deeksha - Sakshi

మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం... 25వ తేదీ 

సాయంత్రం 5 గంటలకు ముగింపు 

మూడు చింతలపల్లిలో ఏర్పాట్లు పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో జరిగే ఈ దీక్షలో రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీలోని దళిత, గిరిజన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను సోమవారం టీపీసీసీ నేతలు పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో పాటు పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

కేసీఆర్‌పై వ్యతిరేకతకు నిదర్శనం: మల్లు రవి 
రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలనే డిమాండ్‌తో రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్షా కార్యక్రమానికి దిగుతున్నారని మల్లు రవి చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. దళితులు, గిరిజనులకు కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top