వయనాడ్‌ను వదులుకున్న రాహుల్‌ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ | Rahul Gandhi To Give Up Wayanad Seat, Priyanka Gandhi To Contest From Wayanad | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ను వదులుకున్న రాహుల్‌ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Jun 17 2024 7:37 PM | Updated on Jun 17 2024 8:15 PM

Rahul Gandhi To Give Up Wayanad Seat, Priyanka Gandhi To Contest From Wayanad

న్యూఢిల్లీ :  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.దీంతో వయనాడ్‌ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ తరుణంలో వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నట్లు రాహుల్‌ గాంధీ అధికారింగా ప్రకటించారు. రాహుల్‌ రాజీనామాతో వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం అనివార్యమైంది.

ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాయ్ బరేలితో గాంధీ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉంది.వయనాడ్‌ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారు. ఆస్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు’ అని ఖర్గే వెల్లడించారు.

‘వయనాడ్‌తో నాకు అనుబంధం ఉంది. జీవితాంతం వయనాడ్ నాకు గుర్తుంటుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. కష్ట కాలంలో వయనాడ్‌ నుంచి నన్ను గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’ అని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

‘వయనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి  సిద్ధంగా ఉన్నా..రాయ్ బరేలిలో నా సోదరుడికి ఎప్పుడు మద్దతుగా ఉంటా’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 
ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా  రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. తాజా రాహుల్‌ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో..ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగ్రేటం అనివార్యమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement