కుప్పంలో ఇప్పటికీ లెక్క తేలని 36 వేల ఓట్లు

PV Midhun Reddy Fires on Chandrababu Naidu over Bogus Votes - Sakshi

కుప్పంలో బోగస్‌ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

రాజంపేట ఎంపీ, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ మిథున్‌రెడ్డి

సాక్షి, కుప్పం(చిత్తూరు జిల్లా) : మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోని బోగస్‌ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రాంత వాసులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సంబంధాలతో బోగస్‌ ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు.

నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓట్లుండగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా ఆధార్‌ కార్డులతో లింక్‌ అయిన వారు 1.83 లక్షల మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 17 శాతం అంటే.. ఇంకా 36 వేల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని, ఈ ఓటర్లు ఎక్కడి వారో, ఎక్కడ ఉన్నారో తేల్చలేకపోతున్నారని చెప్పారు. రామకుప్పం మండలం విజలాపురంలో కుమార్‌ అనే వ్యక్తికి విజలాపురంలో ఓటు హక్కు ఉందని, ఇతను పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోనూ ఓటు వినియోగించుకుంటున్నాడని మిథున్‌రెడ్డి చెప్పారు.

కంగుంది గ్రామానికి చెందిన అమ్మణ్ణమ్మ కంగుందిలో, పక్కనే ఉన్న విజలాపురం పంచాయతీలోనూ ఓటు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి బోగస్‌ ఓట్లతో చంద్రబాబు ఏళ్ల తరబడిగా కుప్పంలో గెలుస్తున్నారని.. కుప్పంలోని బోగస్‌ ఓట్లపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌కుమార్‌ తదితరులున్నారు.   

చదవండి: (రోడ్లపై సభలు, రోడ్‌షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top