Punganur Violence: Chandrababu Conspiracy Revealed by Testimony - Sakshi
Sakshi News home page

బయటపడ్డ పుంగనూరు మర్డర్‌ ప్లాన్‌: అంతా ‘సార్‌’ చెప్పినట్లే..

Aug 17 2023 3:27 AM | Updated on Aug 20 2023 5:29 PM

Punganur Violence: Chandrababu Conspiracy Revealed By testimony - Sakshi

పుంగనూరులో పోలీస్‌ వాహనాలు ధ్వంసం చేస్తున్న టీడీపీ మూకలు. (ఇన్‌సెట్‌లో) చల్లా బాబు (ఫైల్‌)

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పోలీసులను చంపాలన్న కుట్ర, వాహ­నాలను తగులబెట్టడం, వ్యూహ ప్రతివ్యూహాలన్నీ ‘సార్‌’కు తెలిసే జరిగాయా? ఈ విధ్వంసకాండతో సొంత పార్టీ కార్యకర్తల్ని సైతం బలిదానం తీసుకోవాలని ‘సార్‌’ నుంచి ఉత్తర్వులు వచ్చా­యా? పోలీసులు కేసు పెడితే కోర్టులో కాపాడే విషయం కూడా ‘సార్‌’ చూసుకుంటారని స్పష్టమైన హామీ లభించిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఈనెల 4వ తేదీన పుంగనూరు వద్ద జరిగిన విధ్వంసకాండతో పదుల సంఖ్యలో పోలీసులపై హత్యాయత్నం జర­గడం, వాహనాలు తగులబెట్టిన కేసులో ప్రధాన నింది­తుడిగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబు పరారీలో ఉండగా.. ఇతని డ్రైవర్‌ కలకడ నవీన్‌కుమార్, మరో ఇద్దరు నిందితులు దోవల అమర్‌నాథ్, సి.పెద్దన్నలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చల్లా బాబు డ్రైవర్‌ను పోలీసులు విచారించగా ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్‌ను విస్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. నిందితుడి నేర ఒప్పుదల వాంగ్మూలంలో పలు విషయాలను పూస గుచ్చినట్లు చెప్పేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

1వ తేదీ : కుట్రకు రూపం
ఈ నెల 4వ తేదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన పుంగనూరు బైపాస్‌ మీద వెళ్లాల్సి ఉండగా.. అనుమతి లేకున్నా పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి టీడీపీ నేతలు పట్టుపట్టడం, ఆపై పోలీసులను చంపాలని విధ్వంసకాండ సృష్టించగా ఓ పోలీసు కంటిచూపు పోగొట్టుకోగా, పదుల సంఖ్యలో పోలీసులకు తలలు పగిలి రక్త గాయాలైన విషయం తెలిసిందే. ఈ కుట్రకు ఈనెల 1వ తేదీనే టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఉదయం చల్లా బాబు, ఇతని పీఏ గోవర్దన్‌రెడ్డి, డ్రైవర్‌ నవీన్‌కుమార్‌ ముగ్గురూ రొంపిచెర్ల నుంచి పుంగనూరుకు కారులో బయలుదేరారు.

కొద్ది దూరం వెళ్లగానే చల్లా బాబు ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘సరే సార్‌.. సరే సార్‌.. మీరు చెప్పినట్లే చేస్తాను. బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు అన్నీ అక్కడ డంప్‌ చేస్తాం. మిమ్మల్ని టౌన్‌లోకి రానివ్వమంటూ పోలీసులు చెప్పగానే మనవాళ్లు దాడి చేస్తారు. పోలీసులను కానీ, అవసరమైతే వైసీపీ వాళ్లపై దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్లే పోగ్రాం పెట్టిస్తా సార్‌..’ అని మాట్లాడినట్లు సమాచారం. మరుసటి రోజు తన ఇంటి వద్ద జరిగే అతి ముఖ్యమైన సమావేశానికి పిలవాల్సిన కొందరి పేర్లను గోవర్దర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌కు చల్లా బాబు అప్పగించాడు. 

2వ తేదీ : వ్యూహ రచన 
రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లె పంచాయతీ, గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా బాబు ఇంటి వద్ద టీడీపీలోని ముఖ్యమైన నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన హేమంత్‌రెడ్డి, మోహన్‌నాయుడు, నగేష్, రమేష్‌రెడ్డి ఇంకా పలువురు ముఖ్య నేతల్ని పిలిపించిన చల్లా బాబు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇందులో రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు, కర్రలు ఎక్కడ డంప్‌ చేయాలో చెప్పాడు.

పోలీసులు కాల్పులు ఓపెన్‌ చేసేలా ఎలా రెచ్చగొట్టాలో ఆదేశాలిచ్చాడు. ఒకరిద్దరు ఖాకీల ప్రాణాలు పోతే.. టీడీపీ కార్యకర్తలు చేసే బలిదానం వల్ల పార్టీ మైలేజ్‌ పెరుగుతుందని నమ్మబలికాడు. ఇదే జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీకి జరిగే డ్యామేజ్, టీడీపీకి వచ్చే మైలేజ్‌ గురించి వివరించాడు. ఎవరెవరు ఏ పనులు చేయాలో అప్పగించి, అంతా అనుకున్న ప్లాన్‌ ప్రకారం జరగాలని చల్లా బాబు ఆదేశించాడని సమాచారం.

3వ తేదీ : వ్యూహం అమలుపై ప్లాన్‌
చల్లాబాబు మరికొంత మంది టీడీపీ నాయకుల్ని తన ఇంటి వద్దకు పిలిపించాడు. పుంగనూరు విధ్వంసకాండ ఎలా చేయాలి? పోలీసులను ఎలా చంపాలి? ఖాకీలు ఫైర్‌ ఓపెన్‌ చేసేలా రెచ్చగొట్టే విధానం? ఆపై జరిగే అల్లర్లలో ఎవరెవరి పాత్ర ఏమిటనే ప్లాన్‌ గురించి చెప్పాడు.

4వ తేదీ : వ్యూహం అమలు 
ఉదయం 10 గంటలు కావస్తోంది. చల్లా బాబు అంగళ్లుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆపై చల్లా బాబు, అతని పీఏ గోవర్దన్‌రెడ్డి, డ్రైవర్‌ నవీన్‌కుమార్‌తో కలిసి కారులో పుంగనూరు బయలుదేరారు. కారు మదనపల్లె దాటిన తర్వాత.. ‘వీఐపీ కంటే మనం ముందుండాలి.. అక్కడ ఏం చేయాలో ముందుగా అనుకున్నట్లే అంతా జరగాలి’ అని గోవర్దన్‌రెడ్డిని చల్లా బాబు ఆదేశించాడు.

‘అన్నా.. ఇదే జరిగితే పెద్ద గొడవలు జరుగుతాయి. పోలీసులు మనపై కేసులు పెడతారు. ఎట్టా అన్నా..’ అని గోవర్దన్‌రెడ్డి, చల్లా బాబును ప్రశ్నించినట్లు తెలిసింది. ‘పోలీసులు పెట్టే కేసుల్ని కోర్టులో మన ‘సార్‌’ చూసుకుంటాడు..’ అని చల్లా బాబు భరోసా ఇచ్చాడు. ఆపై జరిగిన విధ్వంసకాండలో చల్లా బాబు దగ్గరుండి మరీ టీడీపీ నేతల్ని రెచ్చగొట్టి.. పోలీసులను చంప్రేయండ్రా అంటూ, వాళ్ల వాహనాలను తగులబెట్టాలంటూ ఆదేశాలు ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement