తగ్గేదేలే.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

Political War Between BJP Bandi Sanjay vs Minister KTR - Sakshi

సై అంటే సై అంటున్న రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు

నేతల మధ్య మాటల తూటాలు

మొన్నటివరకు తొడలు కొట్టుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు

తాజాగా టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

రాజీనామా వరకు వెళ్లిన కేటీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై గణాంకాలతో సహా ‘ఫైర్‌’

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పైనా విమర్శలు

దీటుగా కౌంటర్‌ ఇచ్చిన బండి సంజయ్‌

రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఎక్కడా తగ్గడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, పాదయాత్రలు, ఎన్నికల సభలతో రాజకీయ వాతావరణాన్ని రోజురోజుకూ వేడెక్కిస్తున్నాయి. మొన్నటివరకు తొడలు కొట్టుకుంటూ వ్యక్తిగత దూషణలతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు తలపడగా, తాజాగా సీన్‌ టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారింది. 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల మధ్య మంగళవారం మాటల తూటాలు పేలాయి. గత ఆరున్నరేళ్ల కాలంలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి వెళితే రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పిన కేటీఆర్‌.. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను చెప్పింది తప్పయితే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేటీఆర్‌ సవా ల్‌కు సంజయ్‌ దీటుగానే స్పందించారు. సీఎం కేసీఆర్‌ రాజీనామా చేస్తే తానూ చేస్తానని అనడం కాక పుట్టిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో సై అంటే సై అంటున్న ఆ రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రం కాగా, మరోవైపు కాంగ్రెస్‌ కూడా తన వంతు వేడిని పుట్టించేందుకు యత్ని స్తోంది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల పేరుతో ఏకంగా సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహి స్తోన్న గజ్వేల్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. 

సంజయ్, డీకే అరుణలే టార్గెట్‌
జోగుళాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఒక్కసారిగా బీజేపీపై విరుచుకు పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పనిలో పనిగా ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు డీకే అరుణను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.  అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం గద్వాల వెళ్లిన మంత్రి కేటీఆర్‌ కమలనాథులను తన మాటలతో కకావికలం చేసే ప్రయత్నం చేశారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్, బీజేపీకి చెందిన మరికొందరు ఢిల్లీ స్థాయి నేతలు రాష్ట్రానికి వచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ప్రతిగా వారిపై మాటల దాడి చేసేందుకు గద్వాల పర్యటనను కేటీఆర్‌ వినియోగించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సంజయ్‌ ఎదురుదాడి
మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన కేటీఆర్‌నుద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ తుపాకీ రాముడు, అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. మొత్తంమీద కమలం, గులాబీ పార్టీల మధ్య కొనసాగిన సవాళ్ల పర్వం రాష్ట్రంలో రాజకీయ కాకను మరింత వేడెక్కించింది. 

హుజూరాబాద్‌లోనూ పోటా పోటీ
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండదని ఎన్నికల కమిషన్‌ నిర్ధారించినా అక్కడ కూడా టీఆర్‌ఎస్, బీజేపీలు అదే స్థాయిలో దూసుకెళు తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిర్విరామంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. బుల్లెట్‌ బండి ఎక్కి సమావేశాలకు హాజరవుతున్న ఆయన అటు బీజేపీని, ఇటు ఈటలను వదిలిపెట్టడం లేదు. పార్టీని, పార్టీ అభ్యర్థిని ఏకకాలంలో ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ నియోజకవర్గంలో అదే టెంపోని కొనసాగిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఈటల కూడా ఎక్కడా తగ్గకుండానే టీఆర్‌ఎస్‌కు ధీటుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. హరీశ్‌ వ్యాఖ్యలకు ఎక్కడికక్కడ కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

గజ్వేల్‌ గడగడలాడాల్సిందే
కాంగ్రెస్‌ పార్టీ కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వీలున్నప్పుడల్లా వేడెక్కించే ప్రయత్నం చేస్తోంది. దళితబంధు పథకాన్ని టార్గెట్‌ చేస్తూ ఇంద్రవెల్లిలో దండోరా మోగించిన ఆ పార్టీ ఇప్పడు ఏకంగా సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఈనెల 17న అక్కడ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభ నిర్వహించి సత్తా చాటడంతో పాటు ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనను ఏకేయాలనే వ్యూహంతో ముందుకెళుతోంది. కోకాపేట భూముల వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంమీద రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న యుద్ధం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను మించిపోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top