రేవంత్‌ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్‌.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్‌ చేస్తా’

PG Seats Allotment Allegations Puvvada Ajay Challenges TPCC Chief Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మమత వైద్య కళాశాలలో పీజీ మెడికల్‌ సీట్ల దందా జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మంలో 20 ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్‌ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. తన కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్లు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే.. కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని సవాల్‌ విసిరారు. ఒకవేళ నిరూపించలేని పక్షంలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతాయని, అలాంటప్పుడు సీట్లు బ్లాక్‌ చేసి దందా చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.   
చదవండి👉🏾 జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు

నా ఆరోపణల్లో తప్పుంటే తప్పుకుంటా: రేవంత్‌ 
సాక్షి, హైదరాబాద్‌: మంత్రులకు చెందిన మెడికల్‌ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల విషయంలో తాను చేసే ఆరోపణల్లో వీసమెత్తు తప్పున్నా ఏ శిక్షకైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తన ఆరోపణలపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు. ‘మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ కౌన్సిల్‌తో ఒకే రోజు విచారణ జరిపించాలి. అవకతవకలు జరగలేదని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ ఒక్క పరీక్షకు నిజాయితీగా నిలబడండి. అన్నీ దొంగ పనులు చేసి వేషాలు వేస్తున్నారు’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.   కాగా  మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చలో ప్రగతిభవన్‌ కార్యక్రమం నిర్వహించారు.  పోలీసులు వారిని రాజీవ్‌ చౌరస్తా వద్దే అదుపులోకి తీసుకుని గోషామహల్‌కు తరలించారు.   
చదవండి👉 నాకు పీకే చెప్పారు.. టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top