విజయ్‌తో పోలిక.. ట్రోలింగ్‌పై స్పందించిన పవన్‌ | Pawan Kalyan Accepts Tamil Nadu CM Vijay Greater Than Him | Sakshi
Sakshi News home page

విజయ్‌తో పోలిక.. ట్రోలింగ్‌పై స్పందించిన పవన్‌

May 16 2026 7:23 AM | Updated on May 16 2026 7:28 AM

Pawan Kalyan Accepts Tamil Nadu CM Vijay Greater Than Him

సాక్షి, అమరావతి: ‘‘తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయ­న ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉండాలని నాకు మెసేజ్‌ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు.’ అంటూ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యా­నించారు. 

శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేస్తూ నడుస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొన్నారు. ‘‘తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజంగా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో, 2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడపాలంటే ఎంత సత్తా ఉండాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా’ అంటూ పేర్కొ­న్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..    

ఒంటరిగా వెళ్లే చాన్స్‌ ఉన్నా..  
‘‘పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన(చంద్రబాబు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్‌ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఇబ్బందులున్నా.. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.’ అంటూ పవన్‌కళ్యాణ్‌ వెల్లడించారు.   

నా కోసం ఎదురు దాడి చేయండి  
‘సమసమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది, ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలేకపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేకపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి,  ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపోకూడదు కదా?. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పనిచేయడానికి రాలేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా. తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రే­ణులతో మాట్లాడతా’ అంటూ పవన్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement