‘ఇంగ్లిష్ మీడియం వ‌ద్ద‌న్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’ | Parvatha Reddy Chandrasekhar Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఇంగ్లిష్ మీడియం వ‌ద్ద‌న్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’

May 7 2026 9:07 PM | Updated on May 7 2026 9:07 PM

Parvatha Reddy Chandrasekhar Reddy Comments On Chandrababu

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడితే మాతృభాష‌కు ద్రోహం చేస్తున్నార‌ని విమ‌ర్శించిన కూట‌మి నాయ‌కులు, ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం త‌ప్ప‌క ఉండాల‌ని హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించే ద‌మ్ముందా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పేద‌ల పిల్ల‌లు భ‌విష్య‌త్తులో ఉన్న‌త స్థానాల్లో ఉండాల‌న్న ఆకాంక్ష‌తో ప్ర‌భుత్వ బ‌డుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్ర‌వేశ‌పెడితే.. అధికారంలోకి వ‌చ్చాక కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించార‌ని గుర్తుచేసుకున్నారు. త‌మ పిల్ల‌ల‌ను ఇంగ్లిష్ మీడియంలో చ‌దివిస్తున్న కూట‌మి నాయ‌కులు పేద‌ల పిల్ల‌లు ఇంగ్లిష్ మీడియంలో చ‌దువుతుంటే ఓర్వ‌లేక క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని, ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన ఉత్తమ ఫ‌లితాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వేసిన ఫౌండేష‌న్ కార‌ణ‌మ‌ని చెప్పారు. కోట్ల రూపాయ‌ల ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లిచ్చి క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు.  జీతాలు త‌గ్గిస్తామ‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల‌పై ఉద్యోగులంతా సంఘ‌టిత‌మై పోరాడాలని పిలుపునిచ్చారు.

పీఆర్సీ, డీఏ, ఐఆర్‌ల‌పై ప్ర‌శ్నించ‌కుండా జీతాలు త‌గ్గిస్తామ‌ని ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తుంద‌ని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జ‌ర‌గాల్సిన మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఉన్న‌ట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జ‌గన్‌పై విషం చిమ్మారు
2019-24 మ‌ధ్య త‌న ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రిగా వైఎస్‌ జగన్‌ విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్ర‌ధానంగా నాడు- నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్‌కి దీటుగా అభివృద్ధి చేయ‌డంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధ‌న ద్వారా పేద విద్యార్థుల‌కు ఖ‌రీదైన చ‌దువుల‌ను ఉచితంగా అందించారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ఎంతోమంది కూటమి నాయ‌కులు వైఎస్‌ జ‌గ‌న్ మీద విష ప్ర‌చారం చేశారు.

ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాష‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ప్ర‌జ‌ల్లో లేనిపోని అపోహ‌లు సృష్టించారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే స‌ర్కారు బ‌డుల్లో ఆనాడు అమ‌లవుతున్న ఐబీ, టోఫెల్ విధానాల‌పై కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించారు. విద్య ప్రభుత్వ బాధ్య‌త కాదు అని చెప్పిన చంద్ర‌బాబు మ‌నకి ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం దౌర్భాగ్యం. అమ్మ భాష‌ను వైఎస్సార్‌సీపీ నుంచి కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ మాతృ భాష‌కి వ్య‌తిరేకి అని మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ వంటి వారు ప్ర‌చారం చేశారు. తెలుగుభాష‌ను విచ్చిన్నం చేస్తున్నామ‌ని అన్నారు. మాతృభాష‌కు ముప్పు ఉంద‌ని, మాతృ భాష‌లోనే బోధ‌న కొన‌సాగాల‌ని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయ‌డానికి చివ‌రికి కోర్టుల‌ను కూడా ఆశ్ర‌యించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత‌్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డ‌ల‌కు ఇంగ్లిష్ మీడియం చ‌దువులు అందుతుంటే చూసి ఓర్వ‌లేని కూట‌మి నాయ‌కులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయ‌ని కుట్ర‌లు లేవు.

ఆనాడు క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్నారు
పేద విద్యార్థుల‌కు ఇంగ్లిష్ మీడియం చ‌దువులు అందించాల‌ని ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి ప్ర‌భుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నేడు హైకోర్టు ధ‌ర్మాస‌నం కూడా స‌మ‌ర్థించింది. ఉన్న‌తంగా ఎద‌గాలంటే, నేటి స‌మాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్య‌మని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం అమలు చేసింది. తెలుగు స‌బ్జెక్టును త‌ప్ప‌నిచేస్తూ 202-21లో ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే మొద‌టిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.

ఆ త‌ర్వాత ఒక్కో ఏడాది ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం బోధ‌న‌ను వ్య‌తిరేకించిన చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కూట‌మి నాయ‌కులంతా వారి పిల్ల‌ల‌ను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చ‌దివిస్తున్నారు. పేదల పిల్ల‌లు ఇంగ్లిష్ మీడియంలో చ‌దువుతుంటే ఆనాడు క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్న‌వాళ్లంతా ఇప్పుడు త‌మ అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా క‌ళ్లు తెర‌వాలి.

జ‌గ‌న్ పాల‌న‌లో విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌లు
ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో స‌ర్కారు బడుల్లో వ‌చ్చిన మార్కుల‌తో ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు చేసి మొద‌టి పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. ఈ పిల్ల‌లు ఇంత‌టి విజ‌యాలు సాధించ‌డానికి వైఎస్‌ జ‌గన్ ఐదేళ్ల పాల‌న‌లో చేసిన క‌ష్టానికి ఫ‌లిత‌మేన‌ని కూటమి నాయ‌కులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు.

తాగ‌డానికి నీరు కూడా దొర‌క‌ని ప‌రిస్థితుల్లో ఉన్న పాఠ‌శాల‌ల్లో ఆర్వీ వాట‌ర్ ప్లాంట్‌లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వ‌చ్చాక వాటి నిర్వ‌హ‌ణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్‌బీ ప్యాన‌ల్ బోర్డును ల‌క్ష రూపాయల‌తో కొనుగోలు చేసి 62 వేల బోర్డుల‌ను ప్ర‌తి క్లాసులోనూ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

ప్రాథ‌మిక స్థాయి పాఠ‌శాల‌ల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్ల‌ల‌కు లెక్క‌లు బాగా రావాల‌ని పాల్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిల‌బ‌స్‌ను ప్ర‌వేశ‌ పెట్ట‌డంతోపాటు 8వ త‌ర‌గ‌తి నుంచి పిల్ల‌ల‌కు ట్యాబ్‌ల‌తో పాఠాలు చెప్పించారు. జ‌గ‌న‌న్న విద్యాకానుక ద్వారా విద్యార్థుల‌కు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్య‌క్ర‌మానికి వైయ‌స్ జ‌గ‌న్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచ‌ర్ల‌కు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్ర‌మోష‌న్ ఇచ్చి  మూడో త‌ర‌గ‌తి నుంచే స‌బ్జెక్టు టీచింగ్ మొద‌లు పెట్టిన ఘ‌న‌త వైఎస్‌ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది.

కార్పొరేట్ స్కూళ్ల‌కు చంద్ర‌బాబు దాసోహం
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆర్వో ప్లాంట్ల‌ నిర్వ‌హ‌ణ గాలికొదిలేశారు. ట్యాబ్‌లు పాడైనా ప‌ట్టించుకోలేదు. ఆఖ‌రుకి టాయ్‌లెట్ల నిర్వ‌హ‌ణ స‌రిగా లేదు. గోరుముద్ద ప‌థ‌కం ద్వారా నాణ్య‌మైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్ల‌లకు భోజ‌నం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు.  ప్ర‌భుత్వ స్కూల్స్‌, విద్యారంగం గురించి కూట‌మి ప్ర‌భుత్వంలో ఒక్క  గొప్ప నిర్ణ‌యం తీసుకున్న పాపాన‌పోలేదు. ఇవేమీ చేయ‌కుండానే కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకోవ‌డం సిగ్గుచేటు.

వైఎస్‌ జ‌గ‌న్ అమ్మ ఒడి పేరుతో అమ‌లు చేసిన ప‌థ‌కానికి త‌ల్లికి వంద‌నంగా పేరు మార్చి లోకేష్ మ‌దిలో నుంచి వ‌చ్చిన ఆలోచ‌న అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్ప‌డ్డారు. ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని కూడా కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది.  వైయ‌స్సార్సీపీ హ‌యాంలో 17 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీక‌రించాల‌ని చూస్తున్న చంద్ర‌బాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హ‌త లేదు. కార్పొరేట్ విద్యాసంస్థ‌ల‌కు దాసోహ‌మై వారి కోసం ప‌నిచేస్తున్నాడే కానీ ప్ర‌భుత్వ బ‌డుల‌ను తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

హామీల‌పై ప్ర‌శ్నిస్తే ఉద్యోగుల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను చంద్ర‌బాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూట‌మి ప్ర‌భుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం డీఏలు ఇచ్చినా చంద్ర‌బాబు మాత్రం 4 డీఏలు పెండింగ్‌లో పెట్టాడు. ఇంత‌వ‌ర‌కు పీఆర్సీ ఊసే లేదు. క‌నీసం పీఆర్సీ క‌మిష‌న‌ర్‌ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచ‌న చేయ‌డం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజ‌య‌వాడ‌లో ధ‌ర్నా చేశారు. ఉద్యోగులంతా ప్ర‌భుత్వంపై యుద్ధం చేస్తే త‌ప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్ర‌భుత్వం నెర‌వేర్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

పీఆర్సీ, ఐఆర్‌, డీఏల‌పై ఉద్యోగులు ఒత్తిడి చేయ‌డంతో శాల‌రీ కోత‌లంటూ కూట‌మి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్ప‌డుతోంది. ఏపీ హెచ్‌పీ అంటూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మాదిరిగా ఉద్యోగాల జీతాల‌కు కోత‌లు విధిస్తామ‌న్న హెచ్చ‌రిక‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అంద‌రూ సంఘ‌టిత‌పై ప్ర‌భుత్వంపై పోరాడి హ‌క్కుల‌ను సాధించుకోవాలి. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఉద్యోగుల‌ను వైయ‌స్సార్సీపీ ఆదుకుంటుంది. కూట‌మి పాల‌న‌పై స‌ర్వేలు చేయించుకున్న చంద్ర‌బాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేద‌ని తెలిసి షాక‌య్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మ‌హానాడును నెల్లూరు జిల్లాకు చంద్ర‌బాబు మార్చేశాడని ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement