TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! 

Palamaner TDP Leaders Drama Viral Social Media Pension Issue - Sakshi

సాక్షి, చిత్తూరు(పలమనేరు): టీడీపీ నాయకులు గురువారం మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన ఇద్దరు దివ్యాంగులు, వారి తల్లిని పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయానికి పిలిపించి, వారితో అయ్యా.. తమకు పింఛన్‌ రాలేదని చెప్పించి, డ్రామా ఆడించి దాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. కానీ ఇదంతా ఒట్టి డ్రామానేనని అధికారులు తేల్చారు. ఆ నిజాన్ని  మళ్లీ సోషల్‌ మీడియాలో పెట్టి, నిరూపించారు. ఈ సంఘటన గురువారం పలమనేరులో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇందుకు సంబంధించిన పచ్చినిజాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన వీరమ్మ(55)కు వితంతు పింఛను ప్రతినెలా రూ.2750, ఈమె కుమారులైన శంకరయ్య(25), లక్ష్మీనారాయణ(24)కు దివ్యాంగ పింఛన్లుగా ఒక్కొక్కరికి రూ.3 వేలు మొత్తం రూ.8,750 ప్రతినెలా అందుతోంది. ఈ నేపథ్యంలో పింఛన్ల సామాజిక తనిఖీలో భాగంగా గతనెల 27న గంటావూరు సచివాలయ అధికారి జలంధర్, వెల్ఫేర్‌ సెక్రటరీ శివకుమార్‌ వారికి సిక్స్‌స్టెప్‌ వ్యాలిడేషన్‌ ఫారాలను ఇచ్చారు. గత నెల 28న వారి ఇంటిని కొలచి, రికార్డులోకి ఎక్కించారు. నిబంధనల మేరకు ఇల్లు ఉండడంతో పింఛన్లుకు అర్హులేనంటూ ఆన్‌లైన్‌లో వారికి పెన్షన్‌ మంజూరు చేశారు.

చదవండి: (నువ్వు గెలవలేవు.. నన్ను ఓడించలేవు) 

ఈనెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఆ వార్డు వలంటీర్‌ సింధు, అక్కడి పంచాయతీ కన్వీనర్లు, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలసి ఆ కుటుంబంలోని ముగ్గురికి పింఛన్లను అందజేశారు. ఇందుకు సంబంధించి వారు సంతకాలు చేశారు. అయితే వారిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇకపై మీకు పింఛన్లు రావని బెదిరించినట్టు తెలిసింది. పింఛన్లు నమ్ముకుని బతికే తమకు వచ్చేనెల పింఛన్లు రావేమోనని వారు టీడీపీ నాయకులు సూచనలతో పట్టణంలోని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఇంటి ముందు ఆర్తనాదాలు చేస్తూ వెళ్లి తమ కుటుంబంలో అందరికీ పింఛన్లు తొలగించారని చెప్పడం, ముందుగానే పథకం పన్నిన టీడీపీ నేతలు ఆ సంఘటనను వీడియో తీసి, సోషల్‌ మీడియా వైరల్‌ చేశారు.

దీనిపై స్పందించిన అధికారులు, అక్కడి కౌన్సిలర్లు రవి, కన్వీనర్‌ జాఫర్‌ అక్కడకు వెళ్లి వాస్తవాలను మళ్లీ వారినోటే చెప్పించారు. వారు పింఛను తీసుకున్నట్టు ఆధారాలను సోషల్‌ మీడియాలో పెట్టారు. ప్రభుత్వం అర్హులకు పింఛన్లులిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జనం అసహ్యహించుకుంటున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top