సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకే బాబు కుట్ర 

Narayanaswamy Comments On Chandrababu In AP Assembly Sessions - Sakshi

ఇప్పుడున్న మద్యం బ్రాండ్లన్నిటికీ అనుమతిచ్చింది చంద్రబాబు సర్కారే 

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీ, బ్రూవరీకి కూడా అనుమతివ్వలేదు 

శాసనసభలో స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి 

రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించేలా చేసి.. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఇబ్బందులు సృష్టించి.. పేదలను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మద్యం బ్రాండ్లపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి మండిపడ్డారు. శాసనసభలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (సవరణ) బిల్లు–2022ని ఆయన ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లన్నిటికీ చంద్రబాబు సర్కారే అనుమతిచ్చిందని గుర్తు చేశారు.

ఆ బ్రాండ్లన్నీ టీడీపీ నేతలకు అనుమతిచ్చిన డిస్టిలరీలు, బ్రూవరీల్లోనే తయారవుతున్నాయని ఎత్తిచూపారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకిగానీ.. బ్రూవరీకి గానీ అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. మద్యం తయారీ విధానం ఏ సర్కార్‌ హయాంలోనైనా ఒకేవిధంగా ఉంటుందని, అందులో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సంపూర్ణ మద్యపాన నిషేధానికి, రూ.2కే కిలో బియ్యం పథకానికి చంద్రబాబు మంగళం పాడారని గుర్తు చేశారు. పేదల కడుపుకొట్టేలా బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో ఎల్లో మీడియా ఖండించలేదన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. 

బాబు మెడలో ఆ బాటిళ్లతో దండలేయండి 
2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రపతిని, గవర్నర్‌ను కించపరిచేలా లిక్కర్‌ బ్రాండ్లకు ప్రెసిడెంట్స్‌ మెడల్, గవర్నర్స్‌ రిజర్వ్‌ వంటి పేర్లతో అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ను అవమానపరిచిన చంద్రబాబును రాజ్‌భవన్‌ ముందు నిలబెట్టి ఆయన మెడలో గవర్నర్స్‌ రిజర్వ్‌ బాటిళ్ల దండలు వేయండి. టీడీపీ నేతలైన అయ్యన్నపాత్రుడు, ఆదికేశవులునాయుడు, ఎస్పీవై రెడ్డి, యనమల వియ్యంకుడికి డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటుకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు.

వాటిలోనే ఈ లిక్కర్, బీరు బ్రాండ్లు తయారవుతున్నాయి. వీటినే చీప్‌ లిక్కర్, నాటు సారా అంటూ చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి 4,380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు, 43 వేల బెల్ట్‌ షాపులను తన మనుషులు, కార్యకర్తలకు అప్పగించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు 24 గంటలూ విక్రయించి దోపిడీ చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్ట్‌ షాపులు, 4,380 పర్మిట్‌ రూమ్‌లను తొలగించి మద్యం దుకాణాలను 2,934కు తగ్గించాం. 

బిల్లులకు ఆమోదం 
చర్చ అనంతరం ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(సవరణ) బిల్లు–2022ను ఆమోదించినట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు. ఏపీ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌(సవరణ)–2022 బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవేశపెట్టగా.. చర్చ అనంతరం బిల్లును ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top