Nagarjuna Sagar By Election 2021: లైవ్‌ అప్‌డేట్స్‌..

Nagarjuna Sagar By Election 2021: Sagar Win crucial To Three Parties - Sakshi

TIME: 07: 00 PM
ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్
నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

TIME: 05: 00 PM
సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్
నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం నమోదైన పోలింగ్. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

TIME: 03: 10 PM
ఓటు వేసిన ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి
పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్66 లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి. 

TIME: 03: 00 PM
మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్‌
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

TIME: 02: 50 PM
ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్‌‌
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

TIME: 12:57 PM
పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
నాగార్జున సాగర్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ పర్యటించారు. సాగర్ పైలాన్ కాలనీలో పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

TIME: 12:37 PM
ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది.
TIME: 11:25 AM
ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి
నాగార్జున సాగర్‌ హిల్‌ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. 

TIME: 10:19 AM
ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్‌ నమోదు...
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్‌ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది.

TIME: 10:10 AM
ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్‌
నల్గొండ: త్రిపురారం మండలం పలుగు తండా ప్రాథమిక పాఠశాలలో కుటుంబసభ్యులతో పాటు బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు.

TIME: 8:19 AM
ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి...
నల్గొండ: అనుముల మండలం ఇబ్రహీంపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుర్రంపోడ్ మండలం వట్టికోడ్‌ బూత్‌ నంబర్‌-13లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. 

TIME: 7:00 AM
నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకూ సాగర్‌లో విజయం అత్యంత కీలకం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని, విజేత గేమ్‌ చేంజర్‌ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆ పార్టీకి కొత్త ఊపు రావడంతోపాటు.. తెలంగాణ చాంపియన్లం తామేనని నిరూపించుకున్నట్టవుతుందని అంటున్నారు. జానారెడ్డి గెలిస్తే ఇటీవలి ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో దాదాపు నిస్తేజంగా మారిన కాంగ్రెస్‌ పార్టీ ఆశలు 2023 వరకు సజీవంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు దుబ్బాక విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు గాలివాటం కాదని రుజువు చేయాలంటే.. ఇక్కడ గెలిచి తీరాల్సిన అనివార్యత బీజేపీకి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్‌ జరగనుంది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), కాంగ్రెస్, బీజేపీలే తొలి మూడు స్థానాల్లో ఉండనున్నాయి. 

‘మండలి’ ఆక్సిజన్‌తో ధీమాగా టీఆర్‌ఎస్‌
దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం, జీహెచ్‌ఎంసీ ఫలితా లతో కొంత అసంతృప్తిలో ఉన్న టీఆర్‌ఎస్‌కు శాసనమండలి గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. రెండు నియోజకవర్గాల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోగా, మరో స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. ఇప్పుడు తమ సిట్టింగ్‌ స్థానమైన నాగార్జునసాగర్‌ను నిలబెట్టుకోవడం ద్వారా.. దుబ్బాక ప్రతికూల ఫలితం కేవలం తమ ఆదమరుపుతో వచ్చిందేనని, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తుది ఛాంపియన్లు తామేనని రుజువు చేయాలన్న పట్టుదలతో ఉంది.

నోముల నర్సింహయ్య తనయుడిని బరిలోకి దింపడంతో అటు సానుభూతి, మరోవైపు చేసిన అభివృద్ధి.. గెలుపు బాటలో నడిపిస్తాయనే ఆత్మవిశ్వాసంతో ఉంది. జానారెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూనే.. ఈ నియోజకవర్గం తమ చేతికి వచ్చిన రెండేళ్లలోనే చేసిన, చేపట్టిన అభివృద్ధి పనులను అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో పరుగులు పెట్టించనున్న అభివృద్ధి పనుల గురించి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు దఫాలుగా జరిపిన పర్యటనల్లో హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా.. ఇక కాంగ్రెస్‌ పనైపోయిందని రుజువు చేయడం, కొత్త శక్తిగా దూసుకు వస్తున్నామంటున్న బీజేపీ నోరు మూయించడం వంటి బహుళ ప్రయోజనాలను టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది.

కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య!
తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో విజయం జీవన్మరణ సమస్య లాంటిందన్న అభిప్రాయం విన్పిస్తోంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. కొన్నాళ్లకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్నా.. ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్‌ది పేలవమైన ప్రదర్శనే. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సంతృప్తికరమైన ఫలితాలను సాధించలేక పోయింది.

నాగార్జునసాగర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు, రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో రాములు నాయక్‌ కనీస ప్రభావం చూపించలేకపోయారు. ఇలా వరుస ఓటములతో నిస్తేజంలోకి జారిపోయిన కాంగ్రెస్‌ కేడర్‌కు కొత్త ఉత్సాహాన్ని, 2023 ఎన్నికలకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలంటే.. సాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏడు పర్యాయాలు గెలిచి, పధ్నాలుగు ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేసిన జానారెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, నియోజకవర్గంపై పట్టు ఆ పార్టీకి ఉపకరిస్తాయని చెబుతున్నారు. జానారెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలుపు అనివార్యమని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో జానారెడ్డి గత శైలికి భిన్నంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు, ఇన్నేళ్లలో తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. 

బీజేపీ ప్రయోగం ఫలించేనా..?
మరోవైపు రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడ చేసిన ప్రయోగం ఫలిస్తుందా..? అనే ఆసక్తి నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగా జనరల్‌ స్థానమైన నాగార్జున సాగర్‌లో ఎస్టీ వర్గానికి చెందిన డాక్టర్‌ రవికుమార్‌ నాయక్‌ను బరిలోకి దింపింది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకమునుపు ఉన్న ఊపు అభ్యర్థి ప్రకటన వచ్చే వరకు కొనసాగించలేకపోయింది. టికెట్‌ ఆశావాహుల పోటీతో గుంపు రాజకీయాలు మొదలు కావడం, టికెట్‌ రాకపోవడంతో కడారి అంజయ్య యాదవ్‌ గులాబీ గూటికి చేరడం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక పరిస్థితిని బట్టి అంచనా వేస్తే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోటీ నెలకొందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ ఎన్నికలో ఎవరు గెలిస్తే.. వారు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్‌ చేంజర్‌గా మారనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చదవండి: ‘సాగర్‌’ ప్రచారానికి తెర.. పోలింగ్‌పై పార్టీల దృష్టి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top