Munugode Bypolls: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్‌

Munugode Bypoll: KTR Comments At Road Show Narayanapur - Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సంస్థాన్‌ నారాయణపూర్‌ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. 

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ రాకముందు కరెంట్‌ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని కేటీఆర్‌ ప్రశ్నించారు.

‘ప్రధాని మోదీ సామాన్యుడి బతుకు నాశనం చేశారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెంచేశారు. మోదీ అధికారంలో వచ్చినప్పుడు రూ. 400  ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. మోదీ వచ్చినప్పుడు పెట్రోల్‌ ధర రూ.70 ఉంటే ఇవాళ 110 రూపాయలకు చేరింది. కార్పొరేట్‌ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని’ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top