సాయంత్రం 5 గంటల తరువాత 37,665 ఓట్లు.. మునుగోడులో గెలుపోటములు నిర్ణయించేది ఇవే..

Munugode ByElection 2022 Over 37000 Votes Polled After 5PM - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్‌  ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. 

యువత, మహిళలే ఎక్కువ.. 
గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది.   

ఆలస్యం అందుకే.. 
సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్‌లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. 

రూ.10 వేల నుంచి లక్షల్లో.. 
ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్‌ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్‌ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. 

తెల్లవారుజామున స్ట్రాంగ్‌ రూమ్‌లకు.. 
పోలింగ్‌ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top