ములాయం సొంత కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలుసా?

Mulayam Singh Expelled Akhilesh Yadav From Samajwadi Party - Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మూడుసార్లు సీఎంగా, రక్షణమంత్రిగా పనిచేసిన మూలయంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగాను ఆయన ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు.

సొంత కుమారుడు, సీఎం హోదాలో ఉన్న అఖిలేశ్‌ యాదవ్‌నే ఓ సారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ములాయం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పుడు చూద్దాం.

2012లో మొదలు
2012లో అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. అయితే అఖిలేశ్ సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీలో కొందరు స్వాగతించగా.. ములాయం, ఆయన సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌ మాత్రం వ్యతిరేకించారు. తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను సీఎం చేయాలని ములాయం భావించడమే ఇందుకు కారణం. అంతేకాదు ఆ సమయంలో తన బాబాబ్ అయిన శివ్‌పాల్‌ను అఖిలేశ్ రెండు సార్లు కేబినెట్‌ నుంచి తొలగించారు. దీంతో కుటుంబ కలహాలు మరింత ముదిరాయి. అఖిలేశ్‌తో ములాయంకు, శివపాల్ యాదవ్‍కు దూరం పెరిగింది.

సంచలన నిర్ణయం
సమాజ్‌వాదీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో 2016లో సంచలన నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్. తన కుమారుడు, సీఎం అఖిలేశ్ యాదవ్‌, తన బంధువు రామ్‌ గోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ రెండుగా చీలిపోకుండా కాపాడేందుకు, తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.

కానీ ఆ మరునాడే సీఎం అఖిలేశ్ యాదవ్ తన బలమేంటో నిరూపించుకున్నారు. వెంటనే తన నేతృత్వంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ భేటికి మొత్తం 229 ఎస్పీ ఎమ్మెల్యేల్లో 200మంది హాజరయ్యారు. అలాగే కొందరు ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు అఖిలేశ్ యాదవ్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ వేలాది మంది సీఎం కార్యాలయం ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు అప్పుడు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్, రామ్‌ గోపాల్ యాదవ్‌ వర్గం బాహాబాహీకి దిగింది. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వెనక్కితగ్గి..
అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ములాయం సింగ్ వెంటనే అప్రమత్తయ్యారు. తన కుమారుడు అఖిలేశ్, సోదరుడు రామ్ గోపాల్‌పై సస్పెన్షన్‌ను 24 గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ ప్రకటించారు. ములాయంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2017 కొత్త ఏడాదికి ముందు ఇదంతా జరిగింది.

కానీ పార్టీలో అంతర్గత విభేదాలు అక్కడితో ఆగిపోలేదు. 2017 జనవరి 1న జరిగిన పార్టీ జాతీయ సదస్సులో అఖేలిశ్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించారు రామ్‌ గోపాల్ యాదవ్. అప్పటికే ఆ పదవిలో ములాయంను పార్టీ సంరక్షుడి పదవికి పరిమితం చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివ్‌పాల్ యాదవ్‌ను తొలగించారు.

మరో షాక్..
ములాయం సింగ్ యాదవ్‌ మాత్రం వీటికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడైన తాను లేకుండా ఈ సమావేశం నిర్వహించడం అక్రమం అన్నారు. తానే సమాజ్ పార్టీ అధినేత అని, అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అని, శివ్‌పాల్ యాదవ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని స్ఫష్టం చేశారు.

ఈ విషయంలో ఎన్నికల సంఘం మాత్రం అఖిలేశ్ యాదవ్‌నే సమర్థించింది. ఆయన వర్గానికే ఎస్పీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఇదంతా జరిగింది.

ఈసీ నిర్ణయం అనంతరం తాను కొత్తగా సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని స్థాపిస్తానని, ములాయం సింగ్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తారని శివ్‌పాల్ యాదవ్ ప్రకటించారు. కానీ.. కొన్ని నెలల తర్వాత తాను కొత్త పార్టీ స్థాపించడం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలిపోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం.

చివరకు శివ్‌పాల్ యాదవ్ మాత్రం ఎస్పీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018 ఆగస్టులో ప్రగతిషీల్ సమాజ్‌ వాదీ పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేష్ యాదవ్ కూటమిలోనే చేరారు. ఎస్పీ గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేశారు.
చదవండి: అర్బన్ నక్సల్స్‌ గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top