ఎక్కడికి రమన్నా వస్తా, తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ: రేవంత్‌రెడ్డి

MP Revanth Reddy Serious On Minister Malla Reddy And Trs Leaders In HYD - Sakshi

మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని ఆధారాలు ఇచ్చినా.. సీఎం  కేసీఆర్ ఈ అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని ఆరోపించారు.

గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తున్నానని, 50 ఎకరాలలో లేఅవుట్ వేస్తే, మామూళ్లు ఇవ్వాలని మల్లారెడ్డి బహిరంగంగా వసూలు చేశారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై సీఎం కేసీఆర్ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీశారు. 
చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి

గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉందని, ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్‌కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారిందని అన్నారు. న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని, ఆయన కాలేజీలను 5 ఏళ్లు న్యాక్ నిషేధించిందన్నారు. 420 సెక్షన్‌ కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విజిలెన్స్ విచారణలో వందల కోట్లు దోపిడీ చేసిందని వెల్లడైందని పేర్కొన్న రేవంత్‌ రెడ్డి.. దత్తత పేరుతో గ్రామాలను తీసుకొని, ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే,  ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా అని ప్రశ్నించారు. 
చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా, ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ. ప్రగతి భవన్‌కు లేదా ఫాంహౌస్‌కు రమ్మన్నా వస్తా. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా? సవాల్ చేస్తున్నా.. ప్రభుత్వాన్ని రద్దు చేసి రమ్మను. అంత ధైర్యం లేకపోతే.. గజ్వేల్‌లో రాజీనామా చేయి.. తేల్చుకుందాం. మధ్యలో చెంచాలతో తొడగొట్టడాల్లేవ్‌. ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తాం’ అని కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డిపై రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top