అయ్యబాబోయ్‌ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.! | MP Kotha Prabhakar Reddy VS BJP MLA Raghunandan Rao In Dubbaka | Sakshi
Sakshi News home page

అయ్యబాబోయ్‌ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!

Dec 8 2022 9:28 PM | Updated on Dec 8 2022 9:40 PM

MP Kotha Prabhakar Reddy VS BJP MLA Raghunandan Rao In Dubbaka - Sakshi

ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ..

పచ్చగడ్డి వేసినా భగ్గే
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ,  బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది.

దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది.
చదవండి: బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ

కార్యక్రమం ఏదైనా సీన్ సితారే
నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు.  అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది.

తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement