కేసీఆర్‌కు రైతుల బాధ‌లు ప‌ట్ట‌వా..?

MP Komatireddy Venkat Reddy Fires On CM KCR - Sakshi

రైతుల నోట్లో మ‌ట్టి కొడుతున్నారు..

ఎల్ఆర్ఎస్ ర‌ద్దు చేయకపోతే పోరాటం ఉద్దృతం

సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ధ్వజం

సాక్షి, రంగారెడ్డి: రైతుల ప‌ట్ల సీఎం కేసీఆర్‌ వివ‌క్ష చూపుతున్నారని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి పాటుప‌డాల్సిన స‌ర్కార్.. రైతుల‌ను ఎందుకు చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాని మోదీని స‌భ పెట్టి మ‌రీ తిట్టి.. రైతుల బంద్‌కు మ‌ద్ద‌తు తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు అదే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. స్వ‌యాన రైతును అని చెప్ప‌కునే కేసీఆర్‌కు రైతుల క‌ష్టాలు ప‌ట్ట‌వా అని ప్ర‌శ్నించారు. (చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మున్సిపల్‌ చైర్మన్‌ గుడ్‌బై)

రైతుల పొట్ట కొట్టే నూత‌న చ‌ట్టాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఎక్క‌డ త‌ను చేసిన అవినీతి బయ‌ట‌ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డి కేసీఆర్ ఇప్పుడు మోదీ పంచ‌న చేరాడ‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయ రంగంపై ఆధార‌ప‌డ్డారని వారిని జీవితాల‌ను కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అగాథంలోకి నెట్టుతున్నాయ‌ని మండిప‌డ్డారు. రైతుల‌కు అండ‌గా ఉండేందుకు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువ‌చ్చిన ఐకేపీ కేంద్రాల‌ను ఇక‌పై ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు.(చదవండి: కేసీఆర్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి)

కాళేశ్వ‌రం ప్రాజెక్టు, మిష‌న్ భ‌గీర‌థ‌లో ల‌క్ష కోట్ల కుంభకోణానికి పాల్ప‌డ్డ కేసీఆర్.. రైతుల‌కు ఇచ్చిన రూ.7500 కోట్లు ప్ర‌భుత్వానికి న‌ష్ట‌మ‌ని తెల‌ప‌డంపై మండిప‌డ్డారు. రైతుల‌కు ఇచ్చిన నిధుల‌ను న‌ష్టంగా భావిస్తున్న కేసీఆర్‌కు కర్ష‌కుల ప‌ట్ల ఉన్న చిత్త‌శుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. దేశానికే అన్నం పెడుతున్న రైత‌న్న నోట్లో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ట్టి కొడుతున్నాయ‌ని తెలిపారు. వెంట‌నే రాష్ట్రంలో నూత‌న చ‌ట్టాల అమ‌లును విర‌మించుకోకుంటే ఢిల్లీ త‌ర‌హాలో రైతు ఉద్యమం చేప‌డుతామ‌ని కోమ‌టిరెడ్డి స్ప‌ష్టంచేశారు.

ఎల్ఆర్ఎస్‌పై హైకోర్టులో వేసిన పిటిష‌న్ జ‌న‌వ‌రి 9న విచార‌ణ ఉంద‌ని, ఆ విష‌యంలో న్యాయం జ‌రుగుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఎవ‌రు క‌ట్ట‌వ‌ద్ద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఎల్ఆర్ఎస్ ర‌ద్దు కొర‌కు బాధితుల‌తో క‌లిసి నిరాహార దీక్ష చేయనున్నట్లు వివ‌రించారు. అలాగే రాష్ట్ర స‌ర్కార్ దిగిరాక‌పోతే ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముట్ట‌డితో పాటు పోరాటాన్ని ఉధృతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

టీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రం ఆత్మ‌హ‌త్య‌ల తెలంగాణ మారింద‌న్నారు.  అప్పుల బాధ‌లతో రైతులు, ఆర్థిక ఇబ్బందుల‌తో ప్రైవేట్ టీచ‌ర్లు, ఉద్యోగాలు లేక యువ‌త ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీఆర్‌సీ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి భ్ర‌ష్టుప‌డింద‌ని మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందని.. రైతులు, యువ‌త‌కు న్యాయం చేస్తామ‌ని కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top