
సాక్షి, నెల్లూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం పీక్ స్టేజ్‌కు చేరుకుందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్‌సీపీ కేడర్ భయపడే రోజులు పోయాయని హెచ్చరించారు. అలాగే, ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ సంస్కరణలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్క్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించే నైతిక హక్కు టీడీపీకి లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని టీడీపీ నేతలు అమలు చేస్తున్నారు.
ఏపీలో కక్ష సాధింపు చర్యల వల్ల ఊర్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసులు పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే.. గిరిజనులను బెదిరించి.. కాకాణి మీద SC, ST కేసు పెట్టించారు. న్యాయస్థానాల మీద నమ్మకం వుంది కాబట్టే మాజీ మంత్రి కాకాణి కోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తూ.. రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారు. ఏపీలో పరిశ్రమలు మూతపడటానికి ప్రభుత్వ సంస్కరణలే కారణం. అక్రమ కేసులు, నిర్భందాలకు వైఎస్సార్‌సీపీ కేడర్ భయపడే రోజులు పోయాయి. గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినవి అన్నీ వాస్తవాలే. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి గోశాలను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలి. టీటీడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.
