
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కీలక సమావేశం ఆసక్తిగా మారింది. కవితతో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు భేటీ అయ్యారు. దామోదర్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జ్ గండ్ర మోహన్‌రావు కూడా సమావేశమయ్యారు. మూడు గంటలుపైగా కొనసాగిన ఈ సమావేశానికి.. కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అయితే, కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది.
‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న(ఆదివారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్‌ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం.