మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత

Mlc Kalvakuntla Kavitha Comments Modi Government - Sakshi

సాక్షి, చెన్నై: అన్నింటా పూర్తిగా విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఎన్నికల ఉన్న రాష్ట్రాల్లో మోదీ వచ్చే ముందు సీబిఐ, ఈడీ వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా భావ సారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను బీఆర్ఎస్ పార్టీ ఐక్యం‌ చేస్తుందని, బీజేపీ ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోతే, అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని కవిత ప్రశ్నించారు.

చెన్నైలో ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన '2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు?' అనే అంశంపై జరిగిన చర్చ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, హామీలు అమలు చేయడంలో విఫలమై, భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మసకబారేందుకు కారణమైన బీజేపీ 2024 లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని అభిప్రాయపడ్డారు.

పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, రెండు సార్లు అధికారంలో ఉండి చెప్పిన వాటిని పాటించలేదని కవిత పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేసారని ఆమె ప్రశ్నించారు.

2014లో 11 కోట్ల 47 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం ఇస్తామని ప్రారంభించి ఈ ఏడాది కేవలం 3 కోట్ల 80 లక్షల రైతులకు మాత్రమే ఇచ్చారని, కానీ ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పథకం అమలు చేసామని ప్రధాని మోదీ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని కవిత అన్నారు. నిజామాబాద్ పార్లమెంటులోనే 50 వేలకు పైగా రైతులను కేంద్ర కిసాన్ పథకం నుండి తొలగించారన్నారు.

దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోదీ, రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారన్నారు. పార్లమెంటులో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని మోదీ, అదానీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల సంఖ్యను పెంచుతుంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం తగ్గిస్తుందన్నారు.
చదవండి: కేసీఆర్ పీఎం అవుతాడు.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షాత్తు ప్రధాని మోదీ అసత్యాలు చెప్పి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. యువత ప్రధాని మోదీ ప్రసంగాన్ని విని ఎన్ని అబద్దాలు ఉన్నాయో చూడాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top