పార్టీ మారితే నాతో మీరొస్తారా..?

MLA Komatireddy Rajagopal Reddy Hold Meeting With Munugodu Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి నల్లగొండ : ‘నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందునే నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోతున్నా. కనీసం సంక్షేమ పథకాల పంపిణీలో కూడా నా ప్రమోయం లేకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నాకు గుర్తింపు వస్తుందని ఆ పనులకు నిధులు ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీని బలోపేతానికి కృషి చేస్తే అక్కడ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎలాంటి పదవులు ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు.. నేను రాజీనామా చేస్తే కొన్నైనా అభివృద్ధి పనులను చేపడతారు.. అందుకు నిదర్శనం గట్టుప్పల మండల ఏర్పాటే. అందుకే పార్టీ మారడం అనివార్యం.. పార్టీ మారితే నాతో మీరొస్తారా..? వస్తే ఇంతకంటే బాగానే ఉంటుంది.’ 
ఇవీ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో చెబుతున్న మాటలు. దీనినిబట్టి ఆయన పార్టీ మారడం ఖాయమైపోయిందని అర్థం అవుతోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ధ్రువీకరించారు. 

గెలిచినా.. ఓడినా మీవెంటే..
రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖరారు కావడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పనిసరి కాబోతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆగస్టు మొదటివారం, లేదా రెండో వారంలో పార్టీ మారే అవకాశం ఉంది. అంతకంటే ముందు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ఆత్మీయులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పు ఆవశ్యకతను కూడా వివరిస్తున్నారు. హైదరాబాద్‌కు పిలిపించుకొని వారితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాలకు చెందిన నేతలతో చర్చించిన ఆయన బుధవారం మునుగోడు, సంస్థాన్‌నారాయణçపురం మండల నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ముందున్న పరిస్థితులు అన్నింటిని వివరించారు. వెంట రావాలని కోరారు. 

ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా తాను మునుగోడు నుంచే రాజకీయాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. గురువారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ, మండల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలతోనూ భేటీ కానున్నారు. అయితే, పార్టీ మార్పు నేపథ్యంలో తన వెంట వచ్చే నేతలు, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులను, ముఖ్య నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా రెండు మండలాల నేతలతో మాట్లాడుతున్నారు. ఈ భేటీలకు ఒక్కో మండలం నుంచి 150 నుంచి 250 మందికి వరకు నేతలు హాజరవుతున్నారు. ఆయన రాజీనామా, పార్టీ మారే సమయం నాటికి ఆయన వెంట ఎవరెవరు ఉంటారన్నది తేలనుంది.

త్వరలో ప్రత్యేకంగా సర్వే...
తాను ఢిల్లీకి వెళ్లి వచ్చాకే పార్టీ మారుతాననని కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నట్లు తెలిసింది. అంతకుముందే మునుగోడులో తాను ప్రత్యేకంగా సర్వే చేయిస్తానని రాజగోపాల్‌ రెడ్డి పార్టీ నేతలకు తెలియజేశారు. ఆ తరువాతే పార్టీ మారుతానని పేర్కొన్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుంది.. బీజీపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామా వంటి అంశాల ఆధారంగా ఆయన సర్వే చేయనున్నట్లు సమాచారం. తరువాత ఆగస్ట్‌ రెండో వారంలో ఆయన రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ కనుక ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయడం వంటి చర్యలకు సిద్ధమైతే ఆగస్టు మొదటివారంలోనే రాజీనామా చేసే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

పోటీపై కాంగ్రెస్‌ కసరత్తు 
రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వార్తల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికలు వస్తే అక్కడి నుంచి ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపైనా ఆలోచన చేస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడితే తమకు అవకాశం ఇవ్వాలని మాజీమంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి, బీసీ కాన్సెప్ట్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌ నేత కోరుతున్నారు. ఈ మేరకు వారు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇదిలా ఉండగానే తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనల నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు జానారెడ్డి కుమారున్ని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని జిల్లా ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top