ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి 

MLA Chandrasekhar Reddy who did not accept the challenge - Sakshi

ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే కోసం ఎదురుచూసిన వైఎస్సార్‌సీపీ నేతలు 

అనారోగ్యంతో ఉన్నానంటూ అక్కడకి రాని ఎమ్మెల్యే 

ఉదయగిరి/ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతిస్పందించారు. అయితే ఆయన మాత్రం వారి సవాల్‌ను స్వీకరించలేదు. ఉదయగిరికి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. పార్టీకి అన్యాయం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో అడుగుపెడితే ఒప్పుకోబోమని సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి గురువారం ఉదయం హెచ్చరించారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి సాయంత్రం ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని ‘నేను బస్టాండ్‌లో ఉన్నాను.. ఏం చేస్తారో రా..’ అంటూ సవాల్‌ చేశారు.

ఈ విషయం తెలిసిన వినయ్‌రెడ్డి.. తన అనుచరులతో బస్టాండ్‌ వద్దకు చేరుకునేలోపు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రాత్రి, రేపు ఉదయగిరి బస్టాండ్‌లోనే ఉంటా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతిసవాల్‌ చేశారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తమ అనుచరులతో బస్టాండ్‌కు వచ్చి అక్కడే ఉన్న వినయ్‌రెడ్డికి సంఘీభావంగా నిలిచారు. వారు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేయగా.. ఆయన ఫోన్‌ కట్‌ చేశారు.

ఆ తర్వాత అక్కడి వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. సీఎంను, పార్టీ పెద్దలను ఒక్క మాట అన్నా సహించేది లేదని హెచ్చరించారు.  కాగా, ఉదయగిరి బస్టాండ్‌ వద్ద సీఐ వి.గిరిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   

అనారోగ్యంగా ఉన్నాను 
ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మెరు­గైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనపై సవాల్‌ చేసిన వారి గురించి మాట్లాడతానని చెప్పారు. 2024లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. 

పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి 
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో 3 సంవత్సరాలుగా తాము దూరంగా ఉంటున్నామని, ఎవరి వ్యా­పా­రాలు వారు చేసుకుంటున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

మేకపాటి కుటుంబం పట్ల సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆదరణగా ఉంటున్నారని తెలిపారు. సస్పెండైన వారు వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానెల్స్‌ విషప్రచారం చేశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రసారం చేయడం సరికాదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top