సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె.
‘‘బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్‌దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు.
ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్‌ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.


