యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్‌ | Minister Komatireddy Venkat Reddy Fires On Jagadish Reddy In Assembly | Sakshi
Sakshi News home page

యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్‌

Published Fri, Dec 22 2023 5:01 AM | Last Updated on Fri, Dec 22 2023 5:01 AM

Minister Komatireddy Venkat Reddy Fires On Jagadish Reddy In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను అప్పటి మంత్రి జగదీశ్‌ రెడ్డి తిన్నారని నిందించారు. అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌ రెడ్డి దీటుగా స్పందించారు. 

24గంటల విద్యుత్‌ ఎన్నడూ ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి 
తెలంగాణలో విద్యుత్‌ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ పూర్తిగా అవాస్తవమని, ఎనిమిదిన్నర గంటల నుంచి 12 గంటల వరకే విద్యుత్‌ ఇచ్చేదని పునరుద్ఘాటించారు.

కొన్ని ప్రత్యేక రోజుల్లో 16 గంటలు ఇచ్చి ఉండొచ్చు తప్ప 24 గంటలు ఎన్నడూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ శాఖలో నష్టాలకు కారణం అవినీతేనన్నారు. యాదాద్రి ప్రాజెక్టును 29వేల కోట్లకు నామినేషన్‌ మీద అప్పగించారని, జార్ఖండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు యాదాద్రికి రూ. రూ.6వేల కోట్లు తేడా ఉందన్నారు. ఇందులో పెద్ద స్కాం ఉందని, రూ. 10వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. అప్పటి మిర్యాలగూడ ఎమ్మెల్యే బినామీగా ఉండి తిన్నారని ఆరోపించారు. టెండర్‌ పెట్టకుండా ప్రాజెక్టు అప్పగించుడే పెద్ద స్కాం అని ఆరోపించారు.  

సోనియా గాందీతో కొట్లాడి వైఎస్‌ ఫ్రీ పవర్‌ తెచ్చారు 
రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు పేటెంట్‌ కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి సోనియాగాం«దీతో కొట్లాడి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ అమలు చేశారని అన్నారు.  

విచారణకు జగదీశ్‌ రెడ్డి సవాల్‌ 
తనపై గతంలో కూడా ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఆ విచారణలో ఎవరు దోషులుగా తేలితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ఇటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్‌ కాలేదని జగదీశ్‌ రెడ్డి చెప్పారు.

ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలని కొట్టిపారేశారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్‌ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్‌ మూడు అంశాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని జగదీశ్‌ రెడ్డి కోరారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తారా అనేది చూడాలని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement