​వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు..

Minister Harish Rao Fires On MP CM Shivraj singh Chauhan - Sakshi

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

సాక్షి, సిద్దిపేట: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేదని నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు.

దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌..
వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు ఉంది. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని‌ సీఎం పదవి పొందిన శివరాజ్‌కి సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. సీఎంగా నాలుగేళ్లలో ఏం సాధించావు. ఏ రంగంలో మధ్యప్రదేశ్‌ అభివృద్ధి సాధించింది’’ అంటూ దుయ్యబట్టారు. 

వ్యాపం సంగతేంటి?
మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా..? విచారణ నీరుగార్చేందుకు మనుషులనే మీరు చంపేశారు. ఈ విషయంలో మీ కుటుంబం మీద, మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అలాంటి మీరా తెలంగాణలో అవినీతి ఉందంటూ ఆరోపణలు చేసేది అంటూ దుమ్మెత్తిపోశారు. రాజకీయ దురుద్దేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ కేంద్రమంత్రి  పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి  జరగలేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానంగా స్పష్టంగా చెప్పారు‌. విమర్శలు చేసే ముందు ఓ సారి నిజానిజాలు పరిశీలించుకోవాలని’’ హరీశ్‌రావు అన్నారు. 

ఉద్యోగాలు రావొద్దా ?
317 జీవో రద్దు చేయాలంటున్నారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా ? ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు‌ రావాలని సీఎం ప్రయత్నిస్తుంటే.. ఇక్కడి వారికి ఉద్యోగాలు రావద్దన్నట్టుగా బీజేపీ కుట్ర చేస్తోందంటూ హరీశ్‌ మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top