బిహార్‌ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం

MIM Party Wins 5 seats In Bihar Elections 2020 - Sakshi

ఐదు స్థానాల్లో ఘన విజయం

సాక్షి, హైదరాబాద్‌: బిహార్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా తెలంగాణ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింది. 2015లో జరిగిన బిహార్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఐదుచోట్ల తన అభ్యర్థులను బరిలో దింపి అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఒక్క స్థానమూ దక్కలేదు. 2019లో కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోక్‌సభకు పోటీ చేయటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి మజ్లిస్‌ గెలుపొందడం ద్వారా బిహార్‌లో బోణీ కొట్టింది.

ఆ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తాజా ఎన్నికల్లో గ్రాండ్‌ డెమొక్రాటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (జీడీఎల్‌ఎఫ్‌)తో జత కట్టి 20 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఇందులో ఐదుగురు గెలిచారు. అమోర్‌ నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ పార్టీ బిహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్‌ ఇమాన్‌ 49.75 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. మూడుచోట్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ముందు నుంచీ పార్టీ నేతలు భావించారు. కానీ ఐదు సీట్లు రావటంతో ఆ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, 2019 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్‌గంజ్‌లో ఓటమి చవిచూడటం గమనార్హం. మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మాత్రం అడుగు పెట్టింది. 

పూర్తి ఫలితాల తర్వాతే మద్దతుపై నిర్ణయం 
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ 
బిహార్‌ ఎన్నికల పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పడనున్న పరిస్థితులను బట్టి.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. సిమాంచల్‌ అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన బిహార్‌లో ఎంఐఎం సాధించిన విజయం చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top