తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం

Mekathoti Sucharita Fires On Chandrababu Naidu - Sakshi

ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం

హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్‌ చేస్తోందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు. హోంమంత్రి ఇంకా ఏమన్నారంటే..

► ఫోన్‌ ట్యాపింగ్‌లంటూ టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి, చానళ్లలో డిబేట్‌లు నడిపిస్తూ ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. 
► ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతున్నట్టు ఆధారాలుంటే డీజీపీకి ఫిర్యాదు చేస్తే విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
► గతంలో చంద్రబాబు ఇజ్రాయెల్‌ ప్రత్యేక టెక్నాలజీతో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేసిన విషయాన్ని మేం ఆధారాలతోసహా రుజువు చేశాం. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న ఆరోపణలను అదే తరహాలో నిరూపించాలి. 
► కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులను పట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తారు. ఇతరుల ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. 
► చంద్రబాబు చేస్తున్నట్టే మేం కూడా నిరాధారంగా ఆయన హత్యలు చేశాడని, నారా లోకేశ్‌ అత్యాచారాలు చేశాడని ఆరోపిస్తే ఆయన ఊరుకుంటారా. తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.

ప్రజాదరణలో మూడో స్థానం..
► కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడలేదు. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు.
► ప్రజాదరణలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ చిన్న వయసులోనే మంచిపేరు తెచ్చుకోవడాన్ని చూసి ఓర్వలేక సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలు పన్నుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top