మమత పిటిషన్‌పై 12న విచారణ

Mamata Banerjee Poll Plea Court Will Hear The Case On August 12 - Sakshi

నందిగ్రామ్‌ ఓట్ల రికార్డులన్నీ భద్రపర్చండి 

ఎన్నికల సంఘానికి కలకత్తా హైకోర్టు ఆదేశం

కోల్‌కతా/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12న ఆ పిటిషన్‌పై విచారణ జరుపుతామని బుధవారం వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది.

నందిగ్రామ్‌ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) సూచించింది. మమతా బెనర్జీ పిటిషన్‌ను జస్టిస్‌ షంపా సర్కార్‌ విచారించారు. మొదటగా ఈ పిటిషన్‌ జస్టిస్‌ కౌశిక్‌ చంద్ర వద్దకు వెళ్లినప్పటికీ, విచారణ నుంచి ఆయనే స్వయంగా తప్పుకున్నారు. దీంతో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ ఈ కేసును జస్టిస్‌ షంపా సర్కార్‌ ధర్మాసనానికి బదిలీ చేశారు. 

మమత పిటిషన్‌ను బదిలీ చేయండి 
నందిగ్రామ్‌లో తన గెలుపును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రం వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మమత పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్‌ బయట విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీఈసీని కలవనున్న టీఎంసీ నేతలు 
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సీఈసీ) కలవనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎం పదవిలో ఉండగలరు. మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు, శాసన సభ్యులు మరణించగా ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్‌తో తృణమూల్‌ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్‌ వేవ్‌ వచ్చేవరకు వేచి చూస్తున్నారా? అంటూ తృణమూల్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top