
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జీ మీనాక్షీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, పీఏసీ సభ్యులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ పాలన, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీఏసీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు.
లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కాగా, ఇవాళ పలు సమావేశాల్లో పాల్గొనేందుకు ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్న ఖర్గే అక్కడ..ఇటీవలి కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన నేతలతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్‌బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.