Kamal Haasan: నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు  కొనసాగాలి

Makkal Needi Mayyam Party Stepping into 5th Year - Sakshi

సాక్షి, చెన్నై: తాను సొమ్ము చేసుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేయడానికే వచ్చానని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. తనను అడ్డం పెట్టుకుని గల్లాపెట్టె నింపుకునే యత్నం చేసిన వారందర్నీ బయటకు పంపించినట్టు పేర్కొన్నారు. మక్కల్‌ నీది మయ్యం ఏర్పాటు చేసి సోమవారంతో  ఐదేళ్లయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నై ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుక నిరాడంబరంగా జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కమల్‌ ప్రసంగించారు.

తన జీవితం ప్రజల కోసమేనని, ఆ దిశగా రామేశ్వరంలో పార్టీ ఆవిర్భావ వేడుక జరిగిందని గుర్తు చేశారు. ఈసమయంలో తన వెన్నంటి ఉన్న వాళ్లు ఇప్పుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొందరు వ్యాపార దృక్పథంతో పార్టీలోకి వచ్చారని, మరి కొందరు తనను అడ్డం పెట్టుకుని వారి గల్లాపెట్టె నింపుకునే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు నినాదంతోనే తన పయనం కొనసాగుతుందన్నారు. 

చదవండి: (తొలిసారి విదేశీ పర్యటనకు సీఎం స్టాలిన్‌.. అందుకోసమేనా..?)

ప్రజా సేవే లక్ష్యం .. 
బహుళ అంతస్తుల భవనాల్లో కూర్చుని పంచాయితీలతో, బెదిరింపులతో ఆస్తులను కూడ బెట్టుకునే కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో తన కన్నా కోటీశ్వరుడు మరొకరు ఉండరని భావిస్తున్నానని పేర్కొన్నారు. నిజాయితీతో ప్రజా సేవ చేయడమే తన లక్ష్యం, ఆశయం అని వ్యాఖ్యానించారు. తనను కొందరు నాన్న..అని మరికొందరు..తాతా...అని ఇంకొందరు బిగ్‌ బాస్‌ అని పిలుస్తూ, వారి ప్రేమను చాటుకుంటున్నారని వివరించారు.

చిన్న తనం నుంచి ఇప్పటి వరకు తన మీద ఉంచిన అభిమానం, ప్రేమ రాష్ట్ర ప్రజల్లో ఏ మాత్రం  తగ్గలేదని పేర్కొన్నారు. అందుకే మార్పు నినాదంతోప్రజల జీవితాల మెరుగు కోసం తాప త్రయ పడుతున్నానని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు తాను ఉన్నా లేకున్నా, మరో 50 ఏళ్లు  కొనసాగాలని ఆంక్షించారు. అనంతరం సచివాలయంలో సీఎస్‌ ఇరై అన్భును కమల్‌ కలిశారు. గ్రామ పంచాయతీల తరహాలో నగర సభలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరాల్లోని ప్రజలు వారి సమస్యల్ని ఈ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించాలని విన్నవించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top