
సినిమా ప్రచారం కోసమో.. వైఎస్సార్‌సీపీపై ఉన్న అక్కసో తెలియదు కానీ.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఆయనలోని లోపలి మనిషిని బయటపెట్టినట్లు అయ్యింది. ‘‘కోసేస్తాం.. నరికేస్తాం.. అంటే చేతులు కట్టుకుని కూర్చోం’’ అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ మురికి మీడియా ఈ వ్యాఖ్యలను బాగా హైలైట్ చేసింది. ‘‘వైఎస్సార్‌సీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరిక్కడ’’ అనడంతోపాటు పవన్ ఇంకా చాలా మాటలన్నట్లు తెలుస్తోంది.
తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత తన పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైఎస్సార్‌సీపీపై విమర్శలు కూడా చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైఎస్సార్‌సీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా? లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా!. అసలు ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏంటి?. టీడీపీ, సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ల వారి మెప్పుదల కోసం కాకపోతే? హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంపునకు సీఎం అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆక్షేపణ లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం అసెంబ్లీలో ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని గంభీరంగా ప్రకటించినా, పవన్ కళ్యాణ్ కోసం మాట తప్పడం విశేషం. ఈ వ్యవహారంలో పవన్.. వైఎస్సార్‌సీపీ ప్రస్తావన తెచ్చి వారిని బెదిరించాల్సిన అవసరం ఏంటి?. నిజానికి పవన్ కళ్యాణ్ ఏడాదికాలంగా ఒకటి, రెండుసార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబుతో కలిసి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళిక అంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. ఏనాడైనా తన పార్టీ వారితో కలిసి వీటిని సమీక్షించారా?. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని ఎందుకు అమలు చేయలేక పోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా?.
ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తే ఏపీని అమ్ముకోవల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ ఏకీభవిస్తారా?. అది మోసం చేయడం అవుతుందా? కాదా?. కూటమి హామీలకు తనది గ్యారంటీ అని ఆ రోజుల్లో పవన్ ప్రకటించారా? లేదా?. దీనిపై ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడం లేదు?. పోనీ, తన పార్టీ వారి గురించైనా ఆలోచిస్తున్నారా!. శ్రీకాళహస్తిలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే పవన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏంటి?. వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాటేమిటి?. అది అసలు పవన్ దృష్టిలో సమస్యే కాదా?. వైఎస్సార్‌సీపీ వారు కోసేస్తాం.. అని అన్నారట. అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు.
మరి శ్రీకాళహస్తిలో తన పార్టీవారే ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే! సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా!. ఆ పని చేయకుండా వైఎస్సార్‌సీపీ వారిని బెదిరించడం ఏంటి?. ఇప్పటికే ఎర్ర బుక్కు పేరుతో వందలాది మంది వైఎస్సార్‌సీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా!. ఇది పవన్ కళ్యాణ్‌కు సరిపోవడం లేదా!. పోనీ శాఖాపరంగా ఎంత బాగా పని చేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిపైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు?. చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ప్రభాకర్ రెడ్డే ఒక ఏఎస్పీపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదేమి పద్దతి అని అయినా పవన్ అడగగలిగారా?. ముందు తను సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.
టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా! సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలలో నటించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తనను ఎవరూ ఏమీ అనకూడదని భావిస్తే కుదురుతుందా! సినిమాలు మీ ఇష్టం. కానీ, ప్రజలకు అత్యవసరమైన పంచాయతీ రాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? వాళ్లలా తనకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవని పవన్ అంటున్నారు.
వైఎస్సార్‌సీపీ వారిపై విమర్శలు చేయబోయి పవన్ కళ్యాణ్ టీడీపీ వారిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పుపట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలకు ఆయా వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భజన చేసే మురికి మీడియా బోలెడంత ఉండగా సొంత మీడియా అవసరం పవన్‌కు ఏం ఉంటుంది!. ఇవేవీ జనానికి తెలియదన్నట్లుగా పవన్ అమాయకంగా మాట్లాడితే సరిపోతుందా!. సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థ రహితంగా ఉన్నాయి. పైగా జనం అంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్దం ఏం ఉంటుంది?.
పవన్‌కు అధికారం ఉంది కనుక టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైఎస్సార్‌సీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగ్ చేయాలని కోరింది. అదీ తప్పేనా? అవును! తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూప్‌నకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో, లేక ఇంకే కారణమో కాని, ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. దాని గురించి నేరుగా మాట్లాడకుండా సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలనవసరం లేదని, తొలుత మౌలిక వసతులు అభివృద్ది చెందాలని అంటే ప్రయోజనం ఏమిటి?.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విశాఖలో సినీ స్టూడియోలు, ఇతర వసతులు కల్పించడానికి చేసిన కృషి గురించి విస్మరిస్తున్నారు. తనకు పదవి ఉంటే చాలు.. తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు.. అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురివింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.