breaking news
Telugu cine industry
-
పవన్.. పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేసినట్టేనా?
సినిమా ప్రచారం కోసమో.. వైఎస్సార్సీపీపై ఉన్న అక్కసో తెలియదు కానీ.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఆయనలోని లోపలి మనిషిని బయటపెట్టినట్లు అయ్యింది. ‘‘కోసేస్తాం.. నరికేస్తాం.. అంటే చేతులు కట్టుకుని కూర్చోం’’ అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ మురికి మీడియా ఈ వ్యాఖ్యలను బాగా హైలైట్ చేసింది. ‘‘వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరిక్కడ’’ అనడంతోపాటు పవన్ ఇంకా చాలా మాటలన్నట్లు తెలుస్తోంది.తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత తన పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైఎస్సార్సీపీపై విమర్శలు కూడా చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైఎస్సార్సీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా? లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా!. అసలు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏంటి?. టీడీపీ, సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ల వారి మెప్పుదల కోసం కాకపోతే? హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంపునకు సీఎం అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆక్షేపణ లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం అసెంబ్లీలో ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని గంభీరంగా ప్రకటించినా, పవన్ కళ్యాణ్ కోసం మాట తప్పడం విశేషం. ఈ వ్యవహారంలో పవన్.. వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి వారిని బెదిరించాల్సిన అవసరం ఏంటి?. నిజానికి పవన్ కళ్యాణ్ ఏడాదికాలంగా ఒకటి, రెండుసార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబుతో కలిసి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళిక అంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. ఏనాడైనా తన పార్టీ వారితో కలిసి వీటిని సమీక్షించారా?. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని ఎందుకు అమలు చేయలేక పోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా?.ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తే ఏపీని అమ్ముకోవల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ ఏకీభవిస్తారా?. అది మోసం చేయడం అవుతుందా? కాదా?. కూటమి హామీలకు తనది గ్యారంటీ అని ఆ రోజుల్లో పవన్ ప్రకటించారా? లేదా?. దీనిపై ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడం లేదు?. పోనీ, తన పార్టీ వారి గురించైనా ఆలోచిస్తున్నారా!. శ్రీకాళహస్తిలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే పవన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏంటి?. వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాటేమిటి?. అది అసలు పవన్ దృష్టిలో సమస్యే కాదా?. వైఎస్సార్సీపీ వారు కోసేస్తాం.. అని అన్నారట. అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు.మరి శ్రీకాళహస్తిలో తన పార్టీవారే ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే! సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా!. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిని బెదిరించడం ఏంటి?. ఇప్పటికే ఎర్ర బుక్కు పేరుతో వందలాది మంది వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా!. ఇది పవన్ కళ్యాణ్‌కు సరిపోవడం లేదా!. పోనీ శాఖాపరంగా ఎంత బాగా పని చేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిపైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు?. చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ప్రభాకర్ రెడ్డే ఒక ఏఎస్పీపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదేమి పద్దతి అని అయినా పవన్ అడగగలిగారా?. ముందు తను సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా! సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలలో నటించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తనను ఎవరూ ఏమీ అనకూడదని భావిస్తే కుదురుతుందా! సినిమాలు మీ ఇష్టం. కానీ, ప్రజలకు అత్యవసరమైన పంచాయతీ రాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? వాళ్లలా తనకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవని పవన్ అంటున్నారు.వైఎస్సార్సీపీ వారిపై విమర్శలు చేయబోయి పవన్ కళ్యాణ్ టీడీపీ వారిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పుపట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలకు ఆయా వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భజన చేసే మురికి మీడియా బోలెడంత ఉండగా సొంత మీడియా అవసరం పవన్‌కు ఏం ఉంటుంది!. ఇవేవీ జనానికి తెలియదన్నట్లుగా పవన్ అమాయకంగా మాట్లాడితే సరిపోతుందా!. సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థ రహితంగా ఉన్నాయి. పైగా జనం అంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్దం ఏం ఉంటుంది?.పవన్‌కు అధికారం ఉంది కనుక టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగ్ చేయాలని కోరింది. అదీ తప్పేనా? అవును! తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూప్‌నకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో, లేక ఇంకే కారణమో కాని, ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. దాని గురించి నేరుగా మాట్లాడకుండా సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలనవసరం లేదని, తొలుత మౌలిక వసతులు అభివృద్ది చెందాలని అంటే ప్రయోజనం ఏమిటి?.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విశాఖలో సినీ స్టూడియోలు, ఇతర వసతులు కల్పించడానికి చేసిన కృషి గురించి విస్మరిస్తున్నారు. తనకు పదవి ఉంటే చాలు.. తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు.. అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురివింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
థియేటర్ల సంఖ్య తగ్గుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోంది: రానా
టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వచ్చిన సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సీజన్-2 తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. థియేటర్లు తగ్గుతున్న కాలంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బాహుబలి, పుష్ప , ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.రానా మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా థియేటర్లు తగ్గుతున్నాయి. ఏడేమినిదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు తగ్గిపోయాయి. దీనికి కారణం వినోదం అందించేందుకు చాలా ఎక్కువ మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో ఓటీటీ, యూట్యూబ్, మీ మొబైల్ ఫోన్ కూడా భాగమైంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ సినిమా ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కనిపెడుతూనే ఉంది. ఇటీవల రిలీజైన కోర్ట్ మూవీ చిన్న సినిమా అయినా థియేటర్ల వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి రోజుల్లో కూడా కోర్ట్ మూవీ కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమం ఇతర వాటితో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అయ్యే ఖర్చు ముంబయి, ఢిల్లీతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. అది కూడా ఒక అడ్వాంటేజ్.' అని అన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో బంధుప్రీతి గురించి మాట్లాడుతూ.. ఏదేమైనా చివరికి మీరు కెమెరా ముందు నిలబడాలి, నటించాలి కదా' అని తెలిపారు. -
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
సాక్షి,హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేశ్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్‌గా, చిత్రపురి కాలనీ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొమరం వెంకటేశ్ పనిచేశారు. ఆయన మృతి పట్ల సినీ కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి. (చదవండి: Sreeleela: ఆహాలో ఆకట్టుకుంటున్న శ్రీలీల కొత్త సినిమా) -
సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు. పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్‌ను త్వరలోనే కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్, జెమిని కిరణ్ సహా పలువురు ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని, అందుకు తగినట్లుగా పనిచేసేందుకు కృషి చేయనున్నట్లు సి. కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఒక మెగా ఈవెంట్ నిర్వహించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా భావించే చిరంజీవిని కలిసి వివరిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మరింత చొరవ తీసుకోవాలని కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. థియేటర్లు కళకళలాడితేనే సినీ పరిశ్రమ బాగుంటుందన్నారు. -
డైలాగ్ కింగ్ 45 ఏళ్ల సినీ ప్రయాణం
-
బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమపైనే కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ బాలకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోతుందని బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి ఆయన తెలియదా అని ఎద్దేవా చేశారు. గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని సీఎం జగన్ ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. విలువలకు కట్టుబడి సీఎం జగన్ పాలన సాగుతుందని చెప్పారు. (చదవండి : భూములు పంచుకుంటున్నారా?) మానసిక స్థితికి సంబంధించి బాలకృష్ణ ఒకసారి చెక్ చేయించుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ చర్చలకు పిలవలేదన్న బాధ బాలకృష్ణలో కనిపిస్తోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నిర్వహిస్తోంది మహానాడా లేక జూమ్ నాడా అని ప్రశ్నించారు. హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ
-
మరోసారి చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ
సాక్షి, హైదరాబాద్ : సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం భేటీ అయ్యారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థలం సేకరించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాల సేకరణ చేయాలని సూచించారు. సినీ, టీవీ కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పైరసీ నివారణకు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కొద్ది రోజుల కిత్రమే చిరంజీవి, నాగార్జునలు మంత్రి తలసానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే దానికి కొనసాగింపుగానే నేటి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చదవండి : చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ -
దాసరికి తుది వీడ్కోలు..
మొయినాబాద్ రూరల్ (చేవెళ్ల) : సినీ దర్శకుడు, నటుడు, సామాజిక ఉద్యమకారుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట సమీపంలోని ఆయన ఫాంహౌస్ పద్మ గార్డెన్స్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు చితికి నిప్పంటించారు. దాసరి భౌతికకాయానికి నిప్పంటించే ముందు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతకుముందు హైదరాబాద్ నగరంలోని ఫిలిం ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట పద్మగార్డెన్కు చేరుకుంది. అనంతరం దాసరి పద్మ సమాధి పక్కన ఏర్పాటు చేసిన చితిపై దాసరి మృతదేహాన్ని ఉంచారు. దాసరి చితిపై చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు... దాసరి అంత్యక్రియలకు సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత కోడి రామకృష్ణ, సినీ నటులు మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్. నారాయణమూర్తి, శ్రీకాంత్, శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతురావు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రడడ పద్మనాభం తదితరులు హాజరయ్యారుజ కన్నీరు మున్నీరైన దాసరి కుటుంబ సభ్యులు దాసరి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దహనసంస్కారం జరుగుతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా బోరున రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది. దాసరి నారాయణరావు కుమారులు ప్రభు, అరుణ్, కూతురు హేమ, మనుమలు, మనవరాళ్లు తాత మరణాన్ని జీర్ణించుకోలేక కంటతడి పెట్టుకున్నారు. భార్య సమాధి పక్కనే.. దాసరి నారాయణరావు గతంలో ఫాంహౌస్‌కు 15 రోజులకొకసారి, పండుగలప్పుడు ఫాంహౌస్‌కు వచ్చేవారని ఫాంహౌస్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. ఆయన వచ్చినప్పుడల్లా నా సమాధిని కూడా తన భార్య పద్మ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలని చెప్పేవారన్నారు. మూలస్తంభాన్ని కోల్పోయాం : ఎస్పీ బాలసుబ్రమణ్యం దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన మరణంతో తెలుగు సినీరంగం మూలస్తంభాన్ని కోలో్పయినట్టయిందని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. దాసరి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతోమంది నటులు, నటీమణులను, కళాకారులను పోషించి చిత్ర పరిశ్రమకు అందించిన దాసరి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. యువతకు చేయూతనిచ్చిన దాసరి : వీహెచ్ సినీరంగంలో యువతకు దాసరి ఎంతో చేయూతనిచ్చాడని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పద్మ గార్డెన్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దర్శకరత్న దాసరి మృతి యువతకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాజకీయంగా, సినీరంగంలో అందరినీ కలుపుకుపోయే స్వభావం కలిగిన మహనీయుడు దాసరి అన్నారు.