
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం పెట్టి.. 2014-19 మధ్య, ఏడాదిగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలను, మద్యం దందాను ఆధారాలతోపాటు ఎండగడితే.. కూటమి ప్రభుత్వం కానీ.. దాన్ని మోస్తున్న పచ్చమీడియా కానీ సరైన సమాధానమే ఇవ్వలేకపోయింది!. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో జరిగిపోయిందంటూ హడావుడి మాత్రం మళ్లీ తలకెత్తుకుంది!. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలకు ఈ మీడియా నేరుగా సమాధానం ఇవ్వలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా మద్యం దందా గురించి!.
తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే, ఏపీ సీఐడీ వద్ద జగన్ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కామ్‌లకు సంబంధించి రుజువులేవీ లేనట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఆ విషయం నేరుగా చెప్పలేక ‘వేల కోట్లు దోచేసి, ఆధారాలు చెరిపేసి..’ అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక!. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరక్కుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరికి కూడా వీల్లేకుండా చెరిపి వేశారని ఈ కథనం సారాంశం.
వైఎస్సార్‌సీపీ మద్యం ముఠా 375 పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తునకు తీవ్ర అవరోధాలు ఎదురైనా సిట్ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమన్నా అర్థం ఉందా! అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది?. ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన డేటా కంప్యూటర్లలో నమోదవుతాయి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోలేదట. తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిన వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానిని సృష్టించింది కూటమి!.
రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చేవంటోంది ఆ పత్రిక. ఏతావాతా అర్థమయ్యేది ఏంటి? సీఐడీ కేసు ఓ కట్టుకథ అని! ఎల్లో మీడియా సాయంతో జగన్, వైఎస్సార్‌సీపీలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని!. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం.. ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం.. వారితో బలవంతంగా ఏదో చెప్పించడం.. దాని ఆధారంగా మరికొందరి అరెస్ట్.. ఇలా సాగిపోయింది కేసు విచారణ. ఇక ఎల్లో మీడియా పాత్ర మొదలైంది కూడా ఇక్కడే. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మరో విశ్రాంత అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు తరువాత ఇక జగన్ అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టింది.
మద్యం కుంభకోణం లాభాలు విదేశాలకు తరలిపోయాయని ఒకసారి, బంగారం కొన్నారని రెండో రోజు.. ఆస్తులు కొన్నారని ఇంకోసారి, సంచుల్లో నగదు తరలించారని ఆ మరుసటి రోజు.. ఇలా రోజుకో రకమైన కథనాలు రాసుకుంటూ.. ఆఖరకు ఆధారాల్లేకుండా చేశారని ఏడుస్తోంది ఈనాడు! అసలు కుంభకోణమే లేనప్పుడు.. ఆధారాలెక్కడి నుంచి వస్తాయి? జగన్ హయాంలో ఏదో జరిగిందన్న అనుమానం ప్రజల్లో నాటడమే ఎల్లో మీడియా లక్ష్యమని దీంతో మరోసారి స్పష్టమైపోయింది. లేదంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చ పత్రిక ఈ కుట్రకు తెరతీసి ఉండాలి.
పచ్చ మీడియా పోకడలను మొదటి నుంచి నిశితంగా పరిశీలించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని ఆధారాలతోసహా ఎండగడుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం కుంభకోణం లోతుపాతులను, అసలు కర్తలెవరు అన్నది రుజువులతో సహా ప్రజలకు వివరించారు. ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్‌పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 2014-15లో కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అంగీకారం లేకుండా, మద్యంపై ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.
ఫలితంగా అప్పట్లో మద్యం విక్రయాలు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఇందులో అవినీతి ఉన్న సంగతిపై కేసు వచ్చిందని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే క్రమంలో మొత్తం టీడీపీ నేతలే వాటిని కైవసం చేసుకున్నారని, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని జగన్ సోదాహరణంగా వివరించారు. ఇక అనధికార పర్మిట్ రూము వేల కొద్ది బెల్ట్‌షాపులు, ఎమ్మార్పీకి మించి వసూళ్లు జరుగుతున్నాయని, ఇది అసలు మద్యం స్కామ్ అని జగన్ స్పష్టం చేశారు. తాము చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు తన హయాంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అండ్ కో ఓ భేతాళ కథ సృష్టించారని తెలిపారు.
జగన్ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. జగన్‌ను విమర్శించేందుకు కొందరు టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టినా నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. షాపులు ప్రభుత్వం నడిపితే స్కాం జరుగుతుందా? ప్రైవేటు వారికి అప్పగిస్తేనా? అన్న జగన్ ప్రశ్నకు నిశ్శబ్ధమే సమాధానం అవుతోంది. మద్యం రేట్లు పెంచి, డిమాండ్ తగ్గిస్తే డిస్టిలరీలు ముడుపులు ఇస్తాయా? లేక మద్యం రేట్లు తగ్గించి డిమాండ్ పెంచితే ముడుపులు వస్తాయా? అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. తాను కానీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని కూడా జగన్ నిలదీశారు. ఆ అధికారులకు ఎక్సైజ్ శాఖతో సంబంధమే లేనప్పుడు వారెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లోమీడియా ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఎదురుదాడి ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి భిన్నంగా జగన్ చంద్రబాబు టైమ్‌లో కుంభకోణం ఎలా మొదలైంది? తన హయాంలో ఆ అవకాశం ఎందుకు లేకుండా పోయిందో చాలా స్పష్టంగా వివరించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నానా రచ్చ చేసేదన్నది నిర్వివాద అంశం. కానీ వీసమెత్తు ఆధారమూ లేకపోవడంతో కొంతమందిని నిందితులుగా చేసి, బలవంతంగా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుని ఎలాగొలా జగన్‌ను కూడా ఇరికించాలని చంద్రబాబు సర్కార్ వ్యూహం పన్నినట్లు తేలుతోంది. కాకపోతే నిందితుల వాంగ్మూలాలు కేసుకు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్ల అయ్యింది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.