జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.
ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.
ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.
రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.
చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్‌ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.
ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.
ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


