నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా? | KSR Comment: Kutami Govt Escape From Tirupati Stampede | Sakshi
Sakshi News home page

తిరుపతి తొక్కిసలాట ఘటన.. నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?

Jan 9 2025 3:49 PM | Updated on Jan 9 2025 5:21 PM

KSR Comment: Kutami Govt Escape From Tirupati Stampede

తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. 

గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ  క్రౌడ్ మేనేజ్మెంట్‌లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు  కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ  పలు సంస్కరణలు తెచ్చింది. 

ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన  కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్‌సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్‌ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో  ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. 

తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా  భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్‌ సడన్ గా సనాతని వేషం  కట్టి  బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. 

ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వా‍ర్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన  ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా  లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు.  చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. 

తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి  సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ  తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. 

గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. 

టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో  తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు  జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో  పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. 

అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. 

అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో  వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement