Kodali Nani: పేద విద్యార్థులపై ట్రోల్స్‌ చేస్తే తాట తీస్తాం

Kodali Nani Fires On Trollers About Poor Students English - Sakshi

మాజీ మంత్రి కొడాలి నాని 

గుడివాడ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ గుక్క తిప్పుకోకుండా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ పెడుతున్న వారి తాటతీస్తామని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటూ విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌ని సైతం అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పారు.  

అందరికీ ఆదర్శంగా నిలవడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను స్వయంగా సీఎం కార్యాలయానికి రప్పించి అభినందించారని వివరించారు. అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చక్కగా చదువుకోవాలని సీఎం పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అటువంటి విద్యార్థులపై కొంతమంది ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల ఆధారంగా విమర్శిస్తూ పిచ్చి పిచ్చి ట్రోల్స్‌ చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిరుపేద విద్యార్థులు అంటే అంత అలుసా అని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ట్రోల్స్‌ పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి, పేదవాళ్ల మీద జోకులు వేస్తూ అవహేళనగా ప్రవర్తిస్తే అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top